‘అంగన్‌వాడీ’ల ఆధునికీకరణ

  • 960 కేంద్రాల అభివృద్ధికి రూ.2 లక్షల చొప్పున కేటాయింపు
  • 10,472 మరుగుదొడ్లు, 2,628 మంచినీటి కుళాయిల ఏర్పాటు
  • 1,803 అంగన్‌వాడీలకు 3,431 అదనపు తరగతి గదులు
  • ఈ ఏడాది రూ.545.97 కోట్ల కేటాయింపు.. రూ.205.21 కోట్ల విడుదల

మహిళలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక వసతులతోపాటు ఆధునిక సౌకర్యాల కోసం నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో అనేక పథకాల కింద రూ.545 కోట్ల 97 లక్షల 55 వేలను బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.205 కోట్ల 21 లక్షల 74 వేలను విడుదల చేసింది. నూతన విద్యావిధానంలో భాగంగా అంగన్‌వాడీలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో కలిసి బోధన పద్ధతిలో సమన్వయాన్ని తీసుకురావడానికి, పిల్లల మెరుగైన అభ్యాస ఫలితాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలోనే మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 27,620 కేంద్రాలను  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. మరో 27,987 కేంద్రాలను శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ (సొంతంగా అంగన్‌వాడీలు)గా నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న వాటిలో 1,803 అంగన్‌వాడీ కేంద్రాలకు నాడు–నేడు కార్యక్రమంలో 3,431 అదనపు తరగతి గదులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి కసరత్తు మొదలైంది.

వీటితోపాటు ఇప్పటికే 960 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల ఆధునికీకరణ కోసం రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ నిధులతో పాత భవనాల మరమ్మతులు, మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. వీటిలో ఇప్పటివరకు 128 కేంద్రాల పనులు పూర్తయ్యాయి. 282 కేంద్రాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సొంత భవనాలు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాలకు 10,472 మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.15 వేల చొప్పున కేటాయించారు. 2,628 అంగన్‌వాడీ కేంద్రాలకు మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు రూ.10 వేల వంతున నిధులు కేటాయించారు.

అంగన్‌వాడీ కేంద్రాల తాజా పరిస్థితి
రాష్ట్రంలో 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 21,197 కేంద్రాలు పాఠశాలల ఆవరణలో సొంత భవనాల్లో పనిచేస్తున్నాయి. మరో 10,652 అంగన్‌వాడీ కేంద్రాలు పాఠశాల తరగతి గదులు, పంచాయతీలు, ఇతర భవనాల్లో అద్దె లేకుండా నడుస్తున్నాయి. 23,758 అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 55,607 కేంద్రాల్లో మంచినీటి వసతి ఉంది. 41,305 కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉండగా.. 47,488 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం ఉంది.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఇతోధిక నిధులు
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అవసరమైన నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలోని పలు పథకాల ద్వారా నిధులను రాబట్టేందుకు కృషి జరుగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మంచినీరు, మరుగుదొడ్డి తదితర మౌలిక వసతులు కల్పించేందుకు గట్టి ప్రయత్నం సాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో  మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.15 వేలు సరిపోవనే వినతులు రావడంతో ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిధుల కోసం వెనుకడుగు వేయడంలేదు.
– డాక్టర్‌ ఎ.సిరి, మహిళా శిశుసంక్షేమ శాఖ సంచాలకురాలు

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-government-measures-modernization-anganwadi-centers-1463838