అందరిలో ధైర్యాన్ని నింపుతున్న దిశ యాప్

Aug 21, 2021, 03:36 IST

  • శ్రీకాకుళంలో మహిళలకు దిశ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
  • మహిళా భద్రతకు యాప్‌తో అభయం.. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట.. అన్నలా అండగా
  • తాజాగా విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్‌తో దాడి ఘటనలో ముగ్గురు బాధితులను రక్షించిన పోలీసులు
  • దిశ కంట్రోల్‌ రూమ్‌కు ఇప్పటివరకు 2,988 కాల్స్‌
  • వాటిలో వివిధ రీతుల్లో 100 శాతం కేసుల పరిష్కారం
  • 436 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు
  • 148 కేసుల్లో దోషులకు శిక్ష
  • దిశ యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
  • ఇప్పటికే 39 లక్షలకుపైగా డౌన్‌లోడ్లు
  • లైంగిక దాడుల కేసుల సత్వర పరిష్కారంలో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ 

►విశాఖ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో స్నేహం ఏర్పడింది. అతను మానసికంగా వేధించడంతో ఆమె దూరం పెట్టింది. అయితే గత నెల 12న బాధితురాలి ఇంటికి చేరుకుని తలుపులు బాదుతూ వేధించడంతో మధ్యాహ్నం 2.46 గంటలకు దిశ యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. 2.47కు విశాఖ త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం అందింది. 2.55 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువతికి ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భద్రత కోసం రూపొందించిన ‘దిశ’ యాప్‌ నిమిషాల వ్యవధిలోనే బాధితులకు సాయం అందిస్తూ అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాలో నిద్రిస్తున్న ఓ యువతిపై దారుణంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలి కుటుంబం దిశ యాప్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మూడు నిండు ప్రాణాలను కాపాడగలిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆకతాయిల అల్లరి.. ఆగంతకులు వేధింపులు.. బ్లాక్‌ మెయిల్‌… అసభ్య ఫొటోలు.. వీడియోలతో బెదిరింపులు.. దాడులు.. గృహహింస.. ఇలా అన్ని రకాల వేధింపులకు గట్టి పరిష్కారం చూపిస్తోంది. మహిళా భద్రతకు భరోసానిస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోలీసు శాఖ తెచ్చిన యాప్‌ సమర్థ పనితీరు కనబరుస్తోంది. గతంలో మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగేది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బాధితులు సందేహించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణం స్పందిస్తారన్న నమ్మకం ఉండేది కాదు. తమ వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయని జంకేవారు. ఇలాంటి ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తూ దిశ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు భరోసా కల్పిస్తోంది. ఏదైనా సమస్య ఎదురైతే యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కినా, గట్టిగా అటూ ఇటూ ఊపినా చాలు కొద్ది నిముషాల్లోనే పోలీసుల ద్వారా రక్షణ లభిస్తోంది. దీంతో యాప్‌ పట్ల మహిళల్లో విశ్వాసం పెరుగుతోంది. 

అవగాహన సదస్సుతో చైతన్యం..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది జూన్‌ 29న విజయవాడలో నిర్వహించిన దిశ  యాప్‌ అవగాహన సదస్సు మంచి ఫలితాలనిచ్చింది. ఆపత్కాలంలో నిమిషాల వ్యవధిలోనే రక్షణ పొందే అవకాశం ఉందని మహిళలకు అవగాహన కలిగింది. దిశ యాప్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పటివరకు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఏకంగా 3,10,782 కాల్స్‌ వచ్చాయి. వాటిల్లో 2,988 కాల్స్‌ చర్యలు తీసుకోదగ్గవిగా గుర్తించి పోలీసులు తక్షణం స్పందించి భదత్ర కల్పించారు. ఆ కేసులను తగిన రీతిలో వంద శాతం పరిష్కరించడం విశేషం. 436 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  

రికార్డు వేగంతో చార్జిషీట్లు దాఖలు
మహిళలు, యువతులపై దాడులు, వేధింపుల కేసుల్లో రాష్ట్ర పోలీసులు రికార్డు వేగంతో దర్యాప్తు జరిపి చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. వెయ్యి కేసుల్లో కేవలం వారం రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేయడం విశేషం. లైంగిక దాడులు 60, లైంగిక దాడి – పోస్కో 92, పోస్కో కేసులు 130, మహిళలను అవమానించిన 718 కేసుల్లో వారంలోనే చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇక 2,114 కేసుల్లో 15 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. లైంగిక దాడులు 125, లైంగిక దాడి – పోస్కో కేసులు 203, పోస్కో కేసులు 279, మహిళలను అవమానించిన 1,507 కేసుల్లో పక్షం రోజుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. చార్జిషీటు దాఖలై సీసీ నంబర్‌ కోసం నిరీక్షిస్తున్న కేసులు 19 ఉన్నాయి. 

148 కేసుల్లో శిక్షలు ఖరారు
మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను న్యాయస్థానంలో దోషులుగా నిరూపించి తగిన శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో వ్యవహరిస్తోంది. ‘దిశ’ వచ్చిన తరువాత ఇప్పటి వరకు 148 కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేసింది. 

‘దిశ’ కోసం పటిష్ట వ్యవస్థ
►దిశ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఇప్పటికే 900 స్కూటర్లను సమకూర్చింది. త్వరలో రూ.16.60 కోట్లతో 145 కొత్త స్కార్పియో వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 మంది నుంచి 10మందితో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్‌ నేరాలు, సైబర్‌ వేధింపులపై ఫిర్యాదులకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్లు, ట్విట్టర్‌ ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు. 
►సైబర్‌ నేరాలపై 9121211100 వాట్సాప్‌ నంబర్‌కు ఇంతవరకు 3,440 ఫిర్యాదులు రాగా 429 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రాష్ట్రంలో లైంగిక దాడుల చరిత్ర కలిగిన 2,11,793 మంది డేటాను రూపొందించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అఘాయిత్యాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేశారు. 
►మహిళలపై నేరాలపై ఫిర్యాదుకు ట్విట్టర్‌ ఖాతా:  ః @AP Police100
►సైబర్‌ వేధింపులపై ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబర్‌:  9071666667 
►సైబర్‌ వేధింపులపై ఫిర్యాదుకు ట్విట్టర్‌ ఖాతా:  ః @APCID9071666667

39 లక్షలు దాటిన డౌన్‌లోడ్లు..
దిశ యాప్‌ పట్ల స్పందన వెల్లువెత్తుతోంది. దిశ యాప్‌ను అతి తక్కువ కాలంలో 39 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించినట్లుగా కోటి డౌన్‌లోడ్లు లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవాలని పోలీసు శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దిశ యాప్‌పై వివిధ మార్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు వీటిల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ మహిళా పోలీసులు, వలంటీర్ల ద్వారా విస్తృతంగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. వాహనాల తనిఖీల సమయంలో, మాల్స్‌లో, బస్సు ప్రయాణికులకు దిశ యాప్‌ ఆవశ్యకతను వివరిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

రోజూ 4,500 కాల్స్‌..
గతంలో ఎవరైనా సమస్య ఎదురైతే 100 నంబర్‌కు కాల్‌ చేసేవారు. ఎన్నో ఏళ్లుగా డయల్‌ 100 కల్పించిన నమ్మకాన్ని దిశ యాప్‌ అతి తక్కువ వ్యవధిలో సాధిస్తోంది. దిశ యాప్‌ ద్వారా రోజుకు సగటున 4 వేల నుంచి 4,500 వరకు కాల్స్‌ వస్తున్నాయి. వీటిలో దాదాపు 60 కాల్స్‌ తగిన చర్యలు తీసుకునేవిగా ఉంటున్నాయి. రోజుకు సగటున 8 వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. త్వరలోనే డయల్‌ 100కి వస్తున్న కాల్స్‌ సంఖ్యను దిశ యాప్‌ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సత్వర పరిష్కారంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌
దిశ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేసుల సత్వర పరిష్కారంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం ఎంతో మెరుగ్గా ఉండటం విశేషం. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4 శాతం తగ్గాయి. ఇదే సమయంలో మహిళలపై జరిగే నేరాల కేసుల విచారణ సగటు 100 రోజుల నుంచి 86 రోజులకు తగ్గింది. ఇక 2021లో ఏకంగా 42 రోజులకు తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా దేశంలో 35 శాతం లైంగిక దాడుల కేసుల్లోనే దర్యాప్తు పూర్తి కాగా మన రాష్ట్రంలో ఏకంగా 90.17 శాతం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయడం విశేషం. దిశ యాప్, దిశ వ్యవస్థ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు గెలుచుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న దిశ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను పంపించాయి. 

ఆదుకునే అన్నయ్య..
– మేకతోటి సుచరిత, హోం మంత్రి
‘మహిళలు, యువతుల భద్రత కోసం సత్వరం స్పందించే పటిష్ట వ్యవస్థ ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దిశ యాప్‌ రూపుదిద్దుకుంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునే అన్నయ్యలా దిశ యాప్‌ పనిచేస్తుంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి’

దేశానికే ఆదర్శం.. – గౌతమ్‌ సవాంగ్, డీజీపీ
‘మహిళా భద్రత కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పడంలో దిశ యాప్, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ యాప్‌పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా సంఘాలను భాగస్వాములుగా చేసుకుని కార్యాచరణ చేపట్టాం’.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/disha-app-downloaded-over-39-lakh-women-ap-protection-1389212