అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన CM YS Jagan credited Rs 1109 crore into the accounts of 1.02 crore women belonging to ‘Self-help groups’

  పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ పథకం మహిళాసాధికారతలో మరో ముందడుగుగా నిలుస్తుంది. 1.02 కోట్ల మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు దీంతో లబ్ధి చేకూరుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2021 ఏప్రిల్ 23న వరుసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం ఈ వడ్డీని చెల్లించింది. ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వడ్డీ కింద రూ.1109 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామనీ, మహిళాసాధికారతను ఆచరణలోకి తీసుకురాగలిగామనీ అన్నారు. అధికారం చేపట్టగానే బ్యాంకు అధికారులతో మాట్లాడి డ్వాక్రా సంఘాలపై వేస్తున్న వడ్డీ భారాన్ని 12.5% నుంచి 9.5%కి తగ్గించామనీ, దీంతో మహిళలపై రూ.590 కోట్ల మేరకు భారం తగ్గిందనీ ఆయన వివరించారు.

  ‘బ్యాంకుల ద్వారా నేరుగా సున్నావడ్డీకే రుణాలు అందిస్తున్నామనీ, డ్వాక్రా సంఘాల రుణాలపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నామనీ ఆయన చెప్పారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందనీ, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామనీ ఆయన తెలిపారు. అక్కాచెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. మహిళా సాధికారత మా నినాదం కాదు.. మా విధానం. అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం రుణాలను మాఫీ చేయకపోవడం అప్పులపాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక స్వయం సహాయక సంఘాలు మూతపడే స్థితికి చేరాయన్నారు. దీని వల్ల రూ. 3 వేల కోట్ల మేరకు మహిళా సంఘాలు వడ్డీ రాయితీ కోల్పోవలసి వచ్చిందన్నారు. అలా కాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే రూ. 1,400 కోట్ల మొత్తాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద జమ చేశామన్నారు. దీని వల్ల 87 లక్షలకు పైగా మహిళలకు ప్రయోజనం చేకూరిందని ఆయన చెప్పారు. 2019 ఏప్రిల్‌లో స్వయం సహాయక బృందాల సంఖ్య 8.71 లక్షలు ఉండగా అది ఇప్పుడు 9.34 లక్షలకు పెరిగిందని ఆయన తెలిపారు. రిటైల్‌ రంగంలో సొంత వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నామనీ, ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69 వేల దుకాణాలను ఏర్పాటు చేయించామనీ సీఎం చెప్పారు. పాల ఉత్పత్తిలో అమూల్‌తో ఒప్పందం చేసుకొని లీటరు పాలకు రూ. 5-7 వరకు అధికంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ఇళ్లపట్టాలను మహిళల పేరిటే ఇవ్వడం ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో గృహనిర్మాణాల ద్వారా 1.25 కోట్ల మందికి మేలు జరుగుతుందనీ, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళల చేతుల్లో రూ.2-3 లక్షల కోట్ల సంపద ఉంచబోతున్నామనీ ఆయన తెలిపారు.

  మరోవైపు దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60 శాతం పదవులను మహిళలకే కేటాయించామన్నారు.

  రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామనీ, రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామనీ సీఎం వివరించారు. మహిళల కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామనీ, 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామనీ ఆయన చెప్పారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గృహహింసను నిరోధించేందుకు ప్రభుత్వం దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తోందనీ, ఇందులో భాగంగా 43,000 అక్రమ మద్యం షాపులను, 4,380 పర్మిట్ రూములను ప్రభుత్వం మూయించిందనీ ఆయన తెలిపారు.

  వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్ల వయసు దాటిన మహిళలకు వార్షికంగా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. దీని కోసం రూ.4,604 కోట్లను ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రూ. 6,792 కోట్లను ఖర్చు చేశామని ఆయన చెప్పారు. 

  రాష్ట్రంలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలనీ, ప్రతి చిన్నారీ కనీసం గ్రాడ్యుయేట్‌ అవ్వాలనీ ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి.. తద్వారా రాష్ట్రం బాగుంటుంది.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక స్వావలంబనతో మొదలయ్యే ఈ ప్రయాణం సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలను గొప్పగా నిలబెట్టే పరిస్థితి రావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.