9.76 లక్షల పొదుపు సంఘాలకు మూడో విడత సున్నా వడ్డీ

  • కోటి మందికి పైగా మహిళలకు రూ.1,261 కోట్లు లబ్ధి 
  • 22వ తేదీన ఒంగోలులో సీఎం చేతుల మీదగా జమ 
  • అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమాలు  
  • ఇప్పటికే రెండు విడతల్లో రూ.2,354.22 కోట్లు సున్నా వడ్డీ కింద జమ 
  • వ్యాపారాలు చేçస్తూ సకాలంలో రుణాలు చెల్లిస్తున్న మహిళలు 
  • నాడు 18.36% సంఘాలకు ఎన్‌పీఏ ముద్ర; ఇప్పుడది 0.6 శాతమే 

వర్తన చిన్ని… రెండేళ్లుగా ఇంట్లోనే ఓ చిన్న దుకాణం నడుపుతోంది. పెట్టుబడి దాదాపు 70 వేలు. అన్ని సరుకులూ దొరుకుతుండటంతో వ్యాపారం బానే సాగుతోంది. రోజు గడవటానికి ఇబ్బంది లేదు. కాకుంటే రెండేళ్ల కిందట మాత్రం ఈ పరిస్థితి లేదు. అల్లూరి జిల్లా పాడేరు మండలానికి చెందిన చిన్ని…. ఇక్కడి గుడివాడ గ్రామంలో శ్రీనివాస డ్వాక్రా సంఘ సభ్యురాలే. కానీ సంఘాలు సరిగా అప్పులు తీర్చటం లేదని బ్యాంకులు వీటివైపు చూడటం మానేశాయి. చిన్ని లాంటి మహిళలకు అప్పు పుట్టడమే గగనం. దీంతో రోజు గడవటానికీ ఇబ్బంది పడేది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌ ఆసరా కింద రూ.20వేలు అందింది. దీనికి తోడుగా బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుంది.

ఈ పెట్టుబడే ఆమెను నిలబెట్టింది. తలెత్తుకునేలా చేసింది. బ్యాంకు రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో… అదీ ఆమెకు వ్యాపార లాభంగానే మిగులుతోంది. క్రమం తప్పకుండా రుణం తీరుస్తుండటంతో మరికొంత రుణమివ్వటానికి బ్యాంకు సిద్ధంగా ఉంది. ఎవరు తన కథ అడిగినా… సున్నా వడ్డీ పథకం తన జీవితానికి దిగుల్లేకుండా చేసిందంటుంది చిన్ని. చిన్ని లాంటి కథలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 9.76 లక్షల పొదుపు సంఘాల్లో చాలాచోట్ల వినిపిస్తాయి.

ఇంటిని చక్కదిద్దే స్థాయిలో మహిళలు సొంత కాళ్లపై నిలబడ్డారు. దుకాణాలు, జిరాక్స్, ఫ్యాన్సీ షాపులు, బర్రెలు, ఆవులు.. మేకల పెంపకం, ఇలా రకరకాల వ్యాపారాలతో కుటుంబానికి దన్నుగా నిలబడ్డారు. వారు క్రమం తప్పకుండా అప్పు చెల్లిస్తున్నారు కాబట్టే… ప్రభుత్వం కూడా క్రమం తప్పకుండా వడ్డీ రాయితీని చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు రూ.2,354 కోట్లను వడ్డీ రాయితీగా చెల్లించిన ప్రభుత్వం… మూడో ఏడాది కూడా రూ.1,261 కోట్ల మొత్తాన్ని ఈ నెల 22న జమ చేయబోతోంది.

 
ఏటేటా పెరుగుదల 
పొదుపు సంఘ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అందజేస్తోన్న తోడ్పాటుతో మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,85,615 సంఘాలు సకాలంలో తమ రుణాలు చెల్లిస్తే.. 2020–21 ఆర్థిక సంవత్సంలో ఈ సంఖ్య 9,41,088కి పెరిగింది. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9,76,116 సంఘాలకు చెందిన మహిళలు తమ రుణ కిస్తీలను సకాలంలో చెల్లించారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ 24న వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించగా… నాటి నుంచి మహిళలు తమ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందుతూ వస్తున్నారు. ఇలా గత రెండు విడతల్లో రూ.2,354.22 కోట్ల మొత్తాన్ని అందుకున్నారు. మూడో విడతగా ఇప్పుడు మరో రూ.1,261.07 కోట్ల మొత్తాన్ని అందుకోబోతున్నారు. 
 
అప్పట్లో హామీ ఇచ్చి నట్టేట ముంచిన చంద్రబాబు  

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మరిచిపోయారు. దీంతో నాడు రాష్టంలో పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఫలితంగా సంఘాల కార్యకలాపాల్లో కీలకమైన మహిళలు ప్రతి నెలా పొదుపు చేయడాన్ని అప్పట్లో (2014–18 మధ్య) పక్కన పెట్టేశారు. నెల నెలా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవడం మానేశారు.

రుణాలు చెల్లించడం కూడా తగ్గిపోయింది. దీంతో పలు సంఘాలు ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తులు)గా మారిపోయాయి. రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పావలా వడ్డీ వంటి పథకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు నిలిపి వేసింది. ఈ కారణాలన్నింటి వల్ల పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలివ్వటం తగ్గించేశాయి. 
 
కోటి రెండు లక్షల మందికి లబ్ధి 

కోటి రెండు లక్షల మంది మహిళలు 9,76,116 పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,261.07 కోట్ల వడ్డీ డబ్బును ప్రభుత్వం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేయబోతుంది. ఈ నెల 22వ తేదీన మూడో ఏడాది సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తారు.

అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ మహిళలు తమ రుణం మొత్తం చెల్లించడం ద్వారా ఆ రుణ ఖాతా క్లోజ్‌ అయి ఉంటే అలాంటి సందర్భంలో ఆయా సంఘాల పొదుపు ఖాతాలో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు జమ చేయనున్నట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వెల్లడించారు.  
 
అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు 
► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 18.36 శాతం సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించక బ్యాంకుల వద్ద ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తులు)గా ముద్ర వేసుకున్నాయి. 
► ప్రస్తుతం 99.27 శాతం సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో తమ రుణాలు కిస్తీలను చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎన్‌పీఏలు కేవలం 0.63 శాతం సంఘాలే. 
► ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు సంఘంలో మహిళలందరూ సమావేశమై చర్చించుకోవడం, పొదుపు చేసుకోవడం, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని, బాగా కార్యకలాపాలు నిర్వహించుకునే వాటికి ఏ గ్రేడ్‌ ఇస్తారు. తర్వాత స్థాయిలో ఉన్న వాటికి బీ, సీ, డీ గ్రేడ్‌లు కేటాయిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 శాతం సంఘాలు సీ, డీ గ్రేడ్‌లలో ఉంటే.. కేవలం 40 శాతం సంఘాలు మాత్రమే ఏ, బీ గ్రేడ్‌లో ఉన్నాయి. 
► వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  ప్రస్తుతం 91 శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో ఉండగా, కేవలం తొమ్మిది శాతం సంఘాలు మాత్రమే సీ, డీ గ్రేడ్‌లో ఉన్నాయి.  
► మహిళల్లో పొదుపు అలవాటు మరింత పెరిగింది. ఇప్పటి దాకా రాష్ట్రంలోని పొదుపు సంఘాలన్నింటి పేరిట ఉన్న పొదుపు సంఘాల సంఘ నిధి మొత్తం రూ.12,067 కోట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.  
► గత 34 నెలల కాలంలో ప్రభుత్వం పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.71,673.69 కోట్ల మొత్తాన్ని రుణాలుగా ఇప్పించింది.  
► డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి, వడ్డీ శాతం 13.5 నుంచి 9.5కు తగ్గించింది. ఇలా మన రాష్ట్రంలో మాత్రమే జరిగింది. దీంతో పొదుపు సంఘాల కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి.   
► మరోవైపు.. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా (గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరిగిన 2019 ఏప్రిల్‌ 11వ  తేదీ నాటికి) పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాన్ని ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా మహిళలకే అందజేస్తున్న విషయం తెలిసిందే.  
 
ఆర్థిక భారం తగ్గింది 
సున్నా వడ్డీ పథకం మాకు కొండంత అండగా నిలుస్తోంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నందున జీవనోపాధి మెరుగైంది. ఈ పథకం కింద నాకు మొదటి విడతగా రూ.5,800, రెండో విడతగా రూ.6,300 బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో ఏడాది సున్నా వడ్డీ సొమ్ము అందనుంది. మా గ్రూప్‌ సభ్యులంతా కలిసి సక్రమంగా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాం.   
– మడ్డు రాజేశ్వరి, అక్కుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా 

జిరాక్స్‌ షాపు బాగా జరుగుతోంది 
మా సంఘానికి రూ.10 లక్షల రుణం మంజూరైంది. అందరం కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇందులో నా వాటాగా రూ.లక్ష వచ్చింది. నేను జిరాక్స్‌ షాపు పెట్టుకున్నాను. బాగా జరుగుతోంది. నా అప్పునకు గాను నాకు గత ఏడాది వడ్డీ కింద రూ.3,400 వచ్చింది. ఈ షాపు పెట్టుకోవడం ద్వారా ఆర్థికంగా నాలుగు డబ్బులు కళ్ల జూస్తున్నాను. నాలాగ ఎంతో మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బులు ఇస్తోంది. ఈ వారంలో మరో దఫా సున్నా వడ్డీ జమ కానుండటం సంతోషకరం.  
– వి.శాంతి, ముత్యాలమ్మ గ్రూపు సభ్యురాలు, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/third-installment-savings-societies-ysr-sunna-vaddi-scheme-1449570