అన్నదాతలకు అన్నివిధాలా ప్రభుత్వ అండ

  • పండుగలా వ్యవసాయం
  • రాయితీపై ఆధునిక యంత్రాలు
  • సున్నా వడ్డీ రుణాలతో సాయం
  • పంట నష్టపరిహారం కింద రూ.275 కోట్లు అందజేత

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తూ చేయూతనిస్తోంది. పొలం దమ్ముల నుంచి పంటల విక్రయం వరకూ అన్నిదశల్లోనూ ఆసరాగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జై కిసాన్‌ అంటూ.. వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. విపత్తులతో పంట నష్టపోయిన కర్షకులను నేనున్నాంటూ ఆదుకుంటోంది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల ఎకరాలకుపైగా..
జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉండగా, ఖరీఫ్‌లో పూర్తి సాగు ఉంది. రబీ సీజన్‌లో 6.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.  ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, పొగాకు, ఆయిల్‌పామ్, అపరాలు, ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంది. ప్రభుత్వం విత్తు నుంచి పంటల విక్రయం వరకూ సేవలందిస్తున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రాయితీపై పంపిణీ, ఉచిత పంటల బీమా, పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధరలు, పంట నష్టపరిహారం అందజేత, పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా వంటి పథకాలతో రెండున్నరేళ్లలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.  

భరోసా.. రైతు కులాసా
జిల్లాలో వైఎస్సార్‌ రైతు భరోసాలో భాగంగా ఏడాదికి రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. మొదటి రెండేళ్లలో రూ.917.25 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. 2021–22లో ఇప్పటివరకూ 3.19 లక్షల మంది రైతులకు రూ.430.30 కోట్లు అందించారు. 

సున్నా వడ్డీ రుణాలు
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.లక్ష రుణం తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది. 2019–20లో 1.30 లక్షల మందికి రూ.29.19 కోట్లు, 2020 (ఖరీఫ్‌)లో 78,417 మందికి రూ.19.60 కోట్లను అందించారు. 

యంత్ర సాయం
వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు, అధునాతన యంత్రాలు అందిస్తున్నారు. జిల్లాలో క్లస్టర్‌ సీహెచ్‌సీల ద్వారా 22 వరి కోత యంత్రాలను రూ.1.94 కోట్ల రాయితీపై అందించారు. 

1.39 లక్షల మందికి హక్కు పత్రాలు
జిల్లాలో 2021–22లో 1.39 లక్షల మందికి పంట సాగుదారుల హక్కుల పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. వీరిలో 43,525 మందికి రూ.197 కోట్ల రుణాలు అందించారు. 

బీమాతో ధీమా
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద జిల్లాలో ఈ–క్రాప్‌ను పెద్ద ఎత్తున నమోదు చేశారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమాను వర్తింపజేస్తున్నారు. 2020లో ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన 1,02,140 మంది రైతులకు రూ.170 కోట్లు అందించారు. 2020–21లో సంభవించిన ఆరు ప్రకృతి వైపరీత్యాల్లో 54 వేల హెక్టార్ల పంట నష్టపోగా బాధిత 1.12 లక్షల మంది రైతులకు రూ.81 కోట్లను పరిహారంగా అందించారు. 2021 ఏప్రిల్, నవంబర్‌ మాసాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన 29,624 మంది రైతులకు ఈనెల 15న రూ.20.97 కోట్లను అందించి ప్రభుత్వం వారిని ఆదుకుంది. 

రాయితీపై బ్యాటరీ స్ప్రేయర్‌
నాకు ప్రభుత్వం సబ్సిడీపై బ్యాటర్‌ స్ప్రేయర్‌ అందించింది. దీంతో చీడపీడల నివారణకు మందు పిచికారీ చేస్తున్నాను. రైతు భరోసా కేంద్రం ద్వారా రాయితీపై ఎరువులు కొంటున్నాను. అలాగే ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్‌ కూడా ఇక్కడ నుంచే కొనుగోలు చేశాను. ఇలా ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటోంది. రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. 
–అంకం వరప్రసాద్, చొదిమెళ్ల, ఏలూరు రూరల్‌

సేంద్రియ ఎరువులతో భూసారం
నేను రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి పొలం భూసార పరీక్ష చేయించాను. సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకోవాలని అక్కడ సిబ్బంది సూచించారు. జీలుగు, మినుము తదితర నవధాన్యాల కిట్‌ తీసుకుని ఐదెకరాల్లో వెదజల్లాను. ప్రస్తుతం ఏపుగా పచ్చిరొట్ట పెరిగింది. దీనిని దున్ని పొలాన్ని సారవంతం చేసుకుంటాను. దీనిద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. 
–మాగంటి సుబ్రహ్మణ్యం, చొదిమెళ్ల, ఏలూరు రూరల్‌  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-govt-support-farmers-sunna-vaddi-scheme-1436275