అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఏపీ

  దేశంలో మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే చెందుతుందని రెండేళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రస్ రిపోర్టులో ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడిచాయి. రెండేళ్లలో రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు.. చేపట్టిన అభివృద్ధి పనులు.. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతుల పై ఈ డాక్యుమెంట్ లో వివరంగా పొందుపరిచారు. ప్రతి అంశంపైనా ప్రభుత్వ ప్రణాళికలు.. వాటిని ఇప్పటివరకూ అమలు చేసిన వైనం గురించిన పూర్తి వివరాలను గ్రాఫ్స్.. ఫోటోల రూపంలో ఈ డాక్యుమెంట్ లో వివరించారు. మొత్తం 61 పేజీల ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి.

  జాతీయ జీడీపీలో 4.6 శాతం..

  జాతీయ జీడీపీ లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6 శాతంగా ఉంది. మే 31 2021 నాటికి దేశీయ జీడీపీ మొత్తం 203.5 లక్షల కోట్ల అంచనా. కాగా, దానిలో 9.7 లక్షల కోట్ల రూపాయల జీడీపీ వాటా ఆంధ్రప్రదేశ్ రాష్టానిది. రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 4.9 శాతం ఉంటె అది 2019-20 ఆర్ధిక సంవత్సరం నాటికి 7.2 శాతానికి చేరుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ జీడీపీ వృద్ధి రేటు 1.6 శాతంగా ఉంది.

  నవరత్నాలు..

  సమగ్ర సామాజికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నారు.

  వాణిజ్యరంగంపై ప్రత్యేక దృష్టి

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వాణిజ్య రంగంపై ప్రత్యేక దృష్టిని సారించారు. దీంతో 2019-20 నాటికి దేశంలో ఏడో ర్యాంకులో ఉన్న రాష్ట్ర ఎగుమతులు 2020-21 నాటికి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం నాటికి మొత్తం జాతీయ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 5.8 శాతం. రాష్టార్ ఎగుమతుల్లో అత్యధిక భాగం సముద్ర ఉత్పత్తులు (15 శాతం) ఉన్నాయి. ఇక మొత్తం రాష్ట్ర ఎగుమతుల విలువ ప్రస్తుతం 16.8 బిలియన్ డాలర్లు. దీనిని 2030 నాటికి 33.7 బిలియన్ల డాలర్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం.

  కొత్త పోర్టుల నిర్మాణం..

  రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని రామయపట్నం, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనంపాడు పోర్టులను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. దీనిలో రామయపట్నం పోర్టు రెండువేల ఎకరాల్లో 7,500కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నం పోర్టును మూడువేల ఎకరాల్లో 5,156కోట్ల రూపయలతోనూ, భావనపాడు పోర్టు మూడువేల ఎకరాల్లో 5,155 కోట్ల రూపాయలతోనూ అభివృద్ధి చేస్తున్నారు.

  8 ఫిషింగ్ హార్బర్లు..

  రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లను కొత్తగా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీటిలో ఫేజ్ 1 లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పడ లో 360.45 కోట్లతోనూ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 421.17 కోట్లతోనూ, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో 450.46 కోట్లతోనూ, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో 349.11 కోట్ల రూపాయల వ్యయంతోనూ అభివృద్ధి చేస్తారు.
  అలాగే, ఫేస్ 2 లో భాగంగా శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమదకలోనూ, ప్రకాశం జిల్లా కొత్త్పట్నంలోనూ, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పలోనూ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తారు.

  రెండు ఎయిర్ పోర్టులు..

  ఏపీలో కొత్తగా రెండు ఎయిర్ పోర్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుం బిగించింది. విజయనగరం జిల్లలో 2724 ఎకరాల్లో 766 కోట్ల వ్యయంతో భోగాపురం వద్ద జీఎంఆర్ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు ప్రారంభించింది. అలాగే, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు వద్ద వెయ్యి ఎకరాల్లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 150కోట్లు కేటాయించింది.

  మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు..

  దేశంలోనే ఏ రాష్ట్రంలోనో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  1. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్..
  విశాఖ జిల్లా నక్కపల్లి, అచ్యుతాపురం(రాంబిల్లి) ప్రాంతాల్లో మొత్తం 6,848 ఎకరాల్లోనూ, చిత్తూరు జిల్లా సౌత్ బ్లాక్ లో 13,319 ఎకరాల్లోనూ, కొప్పర్తి లోనో 4,085 ఎకరాల్లోనూ ఈ కారిడార్ అభివృద్ధి చేస్తారు.
  2. చెన్నై బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్..
  కృష్ణపట్నంలో మొత్తం 12,944 ఎకరాల్లో ఈ కారిడార్ అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నారు.
  3. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్..
  ఓర్వకల్లు వద్ద 9,350 ఎకరాల్లో ఈ కారిడార్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక.
  ఐటీ అభివృద్ధి కోసం కాన్సెప్ట్ సిటీస్..
  ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధి కోసం మూడు నగరాలను పకాన్సెప్ట్ సిటీస్ పేరుతో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఐటీ కాన్సెప్ట్ సిటీస్ వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఏర్పాటు చేసి.. అక్కడ ఐటీ రంగానికి కావలసిన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపే ఐటీ కంపెనీల కోసం వేగంగా అనుమతులు ఇస్తారు. ఈ కాన్సెప్ట్ సిటీలు జాతీయరహదారులు, విమానాశ్రయాలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకువస్తారు. ప్లగ్ అండ్ ప్లే కో వర్కింగ్ స్పేస్ లు ఏర్పాటు చేస్తారు.

  పారిశ్రామిక ప్రగతి..

  జూన్ 2019 నుంచి ఇప్పటివరకూ ఈ రెండేళ్ళ కాలంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఇలా ఉంది..
  మొత్తం 1,25,572 కోట్ల రూపాయల వ్యయంతో 49 పరిశ్రమలు నెలకొల్పాలనేది లక్ష్యం. వీటి ద్వారా 1,15,375 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. కాగా, ఇప్పటివరకూ 18,334 కోట్ల రూపాయాలతో 18 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. వీటిద్వారా 40,794 మంది ఉపాధి లభిస్తుంది.
  ఇక 2,068 ప్రాజెక్టుల కోసం 2,526 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చారు. ఈ యూనిట్ల ద్వారా 1,54,757 మందికి ఉపాధి లభిస్తుందనేది అంచనా.
  అదేవిధంగా 62 పెద్ద ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగంగా సిద్ధం అవుతున్నాయి. వీటిలో మొత్తం 36,384 కోట్లరూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. వీటి ద్వారా 76,916 మందికి ఉపాధి లభిస్తుంది. పబ్లిక్ సెక్టార్ లో ఐదు యూనిట్లలో 96,400 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభిస్తుంది.
  ఇప్పటివరకూ మొత్తం 29,781 కోట్ల వ్యయంతో 65 పెద్ద యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా 45,049 మంది ఉపాధి పొందుతున్నారు. ఇవి కాకుండా 4,221 కోట్ల రూపాయలతో 13,885 చిన్న యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 88,516 మందికి ఉపాధి లభించింది.

  ఇవే కాకుండా.. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కింద స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న ఉత్పత్తుల విక్రయాలకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. వీటికి ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని కల్పించడంతో పాటు వాటి ఎగుమతులకు అవసరమయ్యే సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని స్థానిక వస్తువులను తయారు చేసే వారికి ఉపాధి మెరుగుపడుతుంది.
  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, తెలంగాణా తరువాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా నాలుగు అంచెల వ్యవస్థను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. వ్యాప్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన చర్యలు సులభతరం చేయడం, వ్యపారాన్ని సులభంగా నిర్వహించుకునే పరిస్థితులు కల్పించడం, వ్యాపార నిర్వహణకోసం అయ్యే ఖర్చులు తగ్గించుకునేలా ప్రయత్నించడం అదేవిధంగా వ్యాపరం నిర్వహించడంలో రిస్క్ తగ్గించడం అనే నాలుగు అంచెలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

  వీటితో పాటు.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇవే కాకుండా నాలు ఐఐఐటీలు, పులివెందుల లో ఒక ప్రత్యెక స్కిల్ కాలేజీ, ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి నైపుణ్యాభివృద్ధిరాస్తు పేరుతో చేస్తున్న ప్రయత్నాలకు అసోచాం నెంబర్ వన రాష్ట్రంగా అవార్డ్ ఇచ్చింది.

  Source: https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-government-2-years-progress-report-showing-the-development-of-the-state-in-all-kinds-481588.html