అపరాల పంటల సాగుకు శాస్త్రవేత్తలు సూచిస్తున్న వంగడాలు

  ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కురుస్తున్న తొలకరి వర్షాలకు మెట్ట ప్రాంతాల్లో అపరాలను సాగు చేయడం ఉత్తమమని మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) రైతులకు సలహా ఇచ్చింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అపరాల సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అన్ని రకాల పప్పు ధాన్యాలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. కంది వంటి పంటలకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్‌లో ధర వస్తోందని క్రిడా శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు.  ప్రస్తుత ఖరీఫ్‌లో కంది, పెసర, మినుము, ఉలవ, అలసంద, పిల్లిపెసర తదితర పంటలు సుమారు 10.57 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. ఈ నేపథ్యంలో ప్రధాన అపరాల పంటలకు శాస్త్రవేత్తలు సూచిస్తున్న వంగడాలు ఇవే.. 

  కంది: ఎల్‌.ఆర్‌.జి. 105, ఎల్‌.ఆర్‌.జి. 133–33, ఎల్‌.ఆర్‌.జి. 52, ఎల్‌.ఆర్‌.జి. 41, టి.ఆర్‌.జి. 59, ఐ.సి.పి.ఎల్‌. 85063 (లక్ష్మీ), ఐ.సి.పి. 8863 (మారుతి), ఐ.సి.పి.ఎల్‌. 87119 (ఆశ). 
  మినుము: జి.బి.జి. 1, టి.బి.జి. 104, ఎల్‌.బి.జి. 787, ఎల్‌.బి.జి. 752, పి.యు. 31. 
  పెసర: ఐ.పి.యం. 2–14, డబ్ల్యూ.జి.జి. 42, ఎల్‌.జి.జి. 460 
  విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచి లేదా అధీకృత డీలర్ల నుంచి కొనుగోలు చేయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాతే నాటుకోవాలని, అందువల్ల చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/millets-cultivation-being-promoted-large-scale-governments-1377856