అరటి సాగు రైతుల్లో ఆనందాలు

  • టన్ను ధర రూ. 18వేలు
  • హెక్టారుకు ఖర్చులు పోను రూ.10 లక్షల ఆదాయం

అరటి సాగు అనగానే రైతులకు, ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు. అనాదిగా ఈ నియోజకవర్గాల్లోని రైతులు అధికంగా అరటి సాగుచేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు తీవ్రంగా నష్టపోయిన  రైతులకు ప్రస్తుతం ఉన్న ధరలు ఆనందంలో ముంచెత్తుతున్నాయి.

ప్రస్తుతం టన్ను (బాక్సుల్లో ఎగుమతి చేసేవి ) 18వేల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ఈ విధానంలో ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు లాభాలను అర్జిస్తున్నారు. అలాగే గెలలతో ఎగుమతి చేసే అరటి 16వేల రూపాయిలకు పైగా ధర పలుకుతోంది. ఈ విధానంలో అరటిని ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో ఇలాంటి ధరలే పలికాయి. అనంతరం ఇంతటి ధర ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేక పోవడంతో రైతులకు లాభాలు అంతంత మాత్రమే ఉండేవి. 

హెక్టారుకు డెబ్బై టన్నుల దిగుబడి 
ఈ ఏడాది అరటి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు దాదాపు 70 టన్నుల దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులు ఘననీయంగానే ఆదాయం పొందుతున్నారు. ఒక హెక్టారు అరటి పంట సాగు చేసేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందువల్ల టన్ను 18 వేలకు విక్రయించే వారికి ఖర్చులు పోను పది లక్షలకు పైగా, 16వేలకు విక్రయించే రైతులకు తొమ్మిది లక్షలకు పైగా మిగులుతుంది. ప్రస్తుతం పచ్చఅరటి, అమృతపాణి, కర్పూర చక్కర కేలి, సుగంధాల రకాల అరటిని రైతులు కోస్తున్నారు. 

ధర పెరుగుదల ఎందుకంటే….. 
అరటి పిలకలను పూడ్చిన తర్వాత ఏడాదికి పంట చేతికి వస్తుంది. గత ఏడాది మే నెలలో వేసిన పంట ఇప్పుడు చేతికి వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో సంభవించిన భారీ వరదలకు అనేక మందికి చెందిన అరటి తోటలు వరల ధాటికి కొట్టుకు పోయాయి. ఫలితంగా పంట భారీగా తగ్గింది. ప్రస్తుతం అమాంతంగా పెరిగిన ధరలకు పంట తక్కువగా ఉండటమేనని రైతులు అంటున్నారు.  

అస్సలు ఊహించలేదు 
ప్రస్తుతం అరటి పంటకు ఉన్న ధరను అసలు ఊహించలేదు. నేను పదకొండు ఎకరాల్లో అరటి సాగుచేశాను. వరదలకు నా పంట దెబ్బతినలేదు. ప్రస్తుతం ఉన్న ధరకు నాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. 
 – ముక్కా చెంగల్‌రెడ్డి, రైతు,  కొర్లకుంట, ఓబులవారిపల్లె మండలం 

ఐదు రాష్ట్రాలకు ఎగుమతి
రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లోని రైతులు పండించే అరటి నాణ్యత ఉంటుంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పంట కోతకు రావడానికి రెండు నెలల ముందు నుంచే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు తమ పంటను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం చాలామంది రైతులకు చెందిన పంట కోతకు రావడంతో పల్లెసీమల నుంచి జోరుగా అరటి రవాణా సాగుతుంది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/happiness-among-farmers-banana-cultivation-annamayya-district-1459949