అవుకు సొరంగం పనులు కొలిక్కి..

  • ఫాల్ట్‌ జోన్‌ ప్రాంతంలో అత్యాధునిక పోర్‌ ఫిల్లింగ్‌ టెక్నాలజీతో సొరంగం తవ్వకం
  • లైనింగ్‌తో సహా మిగిలిన 1,038 మీటర్ల పొడవైన సొరంగం పనులు శరవేగం

  సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మరో తార్కాణమిది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్‌ జోన్‌ (బలహీనమైన మట్టి పొరలు) వల్ల తవ్వలేకపోతున్నామని గత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు ఆ సొరంగాన్ని హిమాలయ పర్వతాల్లో సొరంగాల తవ్వకానికి వినియోగిస్తున్న అత్యాధునిక పోర్‌ ఫిల్లింగ్‌ టెక్నాలజీతో ప్రభుత్వం తవ్వుతోంది. ఈ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆగస్టు నాటికి 1,038 మీటర్ల పొడవున్న సొరంగాన్ని లైనింగ్‌తో సహా పూర్తి చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి.. 2.60 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్సార్‌ గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టారు.

  చేతులెత్తేసిన గత టీడీపీ సర్కార్‌
  శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్‌ఆర్‌ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల(ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో ఒకటో సొరంగాన్ని 5.835 కి.మీ. పొడవున.. రెండో సొరంగాన్ని 4.962 కి.మీ. మేర తవ్వకం పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌ ఒకటో సొరంగంలో మిగిలిన 165 మీటర్ల పనులను ఫాల్ట్‌ జోన్‌ సాకు చూపి పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఫాల్ట్‌ జోన్‌లో సొరంగం తవ్వకుండా.. పక్క నుంచి కాలువ(లూప్‌) తవ్వి చేతులు దులుపుకుంది. అవుకు రెండో సొరంగం పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్‌ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో సొరంగం తవ్వకం పనులు వేగవంతమయ్యాయి. రెండో సొరంగంలో మిగిలిన 1,038 మీటర్లలో ఇప్పటికే 615 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఫాల్ట్‌ జోన్‌లో 165 మీటర్ల పనులు చేసేందుకు ‘పోర్‌ ఫిల్లింగ్‌’ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు హిమాచల్‌ నుంచి నిపుణులను రప్పించారు.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/tunnel-excavation-new-porfilling-technology-fault-zone-area-1366739