అవ్వాతాతలకు భరోసా

రెండేళ్లలోనే ఏకంగా 18.44 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు.. అవ్వాతాతల పింఛన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదింపు..తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారితో పాటు తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫీలియా, పక్షవాతం, కండరాల క్షీణత వంటి వ్యాధులతో దీర్ఘ కాలంగా మంచానికే పరిమితమయ్యే వారికి రూ.10 వేల చొప్పున పింఛన్‌.. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. కుటుంబంలో ఒకరు పింఛన్‌ పొందుతున్నప్పటికీ, ఆ కుటుంబంలో అర్హత ఉంటే రెండో వారికి కూడా పింఛను మంజూరుకు అనుమతి.. ఈ ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే రూ.2,250కి పింఛన్‌ను పెంచుతూ సంతకం.. ఇలాంటి వారందరి జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం నేడు మరో పెద్ద ముందడుగు వేస్తోంది. ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించారు.

ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి..
► అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే.
► రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు  కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్‌ రిపోర్టు సైతం పేర్కొంది.
► కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంది.  
► 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. 

అవ్వాతాతల పడిగాపులకు చెక్‌.
► గత ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు వరకూ రూ.1000 చొప్పున పింఛన్‌ పంపిణీ జరిగింది. అప్పట్లో అర్హత ఉన్న వారికి పింఛను మంజూరుకు జన్మభూమి కమిటీలు తీవ్ర ఇబ్బందులు పెట్టేవి. మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు కూడా గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. 
► ఇప్పుడు పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేదు. వలంటీర్లే ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్‌ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం అన్నది దేశంలోనే తొలిసారి.
► మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,500 కోట్లకు పైబడి ఖర్చు చేస్తుంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. అప్పటి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాది మొత్తం వ్యయం రూ.5,500 కోట్లే. 

లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత 
► అర్హత ఉన్న అందరికీ పింఛన్‌ అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని విధానం ప్రవేశ పెట్టింది. 
► కులం, మతం, వర్గం చూడకుండా అర్హులను ఎంపిక చేస్తోంది. సామాజిక తనిఖీ కోసం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. 
► అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజులకే మంజూరు ప్రక్రియ పూర్తి కావాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించినా.. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ
2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వలంటీల్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతోంది. అయితే నేటి నుంచి పింఛన్‌ మొత్తం రూ.2,500కు పెరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం లాంఛనంగా ప్రారంభించారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/above-18-lakh-new-pensions-two-years-laying-big-platform-social-security