అవ్వాతాతల కంటి పరీక్షలు వచ్చే ఏడాదికి పూర్తి

  • 60 ఏళ్లు దాటిన 56.88 లక్షల మందికి కంటి పరీక్షలు లక్ష్యం 
  • ఇప్పటికే 13.58 లక్షల మందికి పూర్తి 
  • సాధారణ మందులతో 4.71 లక్షల మంది చూపు బాగు 
  • 7.60 లక్షల మందికి అద్దాలు అవసరమని గుర్తింపు 
  • ఇందులో 4.69 లక్షల మందికి కళ్లజోళ్ల పంపిణీ 
  • 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరం 
  • వీరిలో ఒక లక్ష మందికి పూర్తి

ఏపీలో తొలిసారిగా 60 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మందులతో పాటు కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ఇందులో ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా కారణంగా ఈ పరీక్షలకు అవరోధం ఏర్పడింది.

కరోనా తగ్గడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4.71 లక్షల మందికి మందుల ద్వారా కంటిచూపు మెరుగుపరిచారు. 7.60 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడమే కాకుండా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ఆర్డర్‌ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 4.69 లక్షల మంది అవ్వా తాతలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకు 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా.. వాటిని ఒక లక్ష మందికి పూర్తిచేశారు. 

అక్టోబర్‌ రెండు నుంచి మధ్య వయస్కులకు.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అవ్వా తాతలందరికీ కంటి పరీక్షలను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఇప్పటికే స్కూలు పిల్లలకు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్‌ నాటికి అవ్వాతాతల కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్య వయస్సుల వారికి కూడా ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్‌ రెండు నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. మొత్తం మీద అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  
– డా. హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్‌ అధికారి, వైఎస్సార్‌ కంటి వెలుగు)   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/eye-tests-will-be-completed-next-year-ysr-kanti-velugu-1413564