ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతున్న డిగ్రీ అడ్మిషన్లు

  • యువతకు ఉపాధి అవకాశాలు చేరువ చేయడమే సర్కారు లక్ష్యం
  • ఇప్పటికే ఉన్న తెలుగు మాధ్యమ విద్యార్థుల బోధనలో మార్పు ఉండదు
  • ఎయిడెడ్‌ కాలేజీల్లోని ఎయిడెడ్‌ సెక్షన్లు ఇక అన్‌ ఎయిడెడ్‌
  • ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌
  • 23 నుంచి వెబ్‌ ఆప్షన్లు.. 29న సీట్ల కేటాయింపు
  • అక్టోబర్‌ 1 నుంచి తరగతులు

రాష్ట్రంలోని డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న యువతకు ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేందుకు వీలుగా విద్యాశాఖ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను 2021–22 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించాలని నిర్ణయించింది. నిజానికి.. ఆంగ్లంలో నైపుణ్యాలున్న వారిని, ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించిన వారినే పలు సంస్థలు ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తున్న విషయాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

‘ఫైండింగ్స్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఎట్‌ వర్క్‌ : గ్లోబల్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఇన్‌ వర్క్‌ ప్లేస్‌’.. పేరిట కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడుదల చేసిన ఓ నివేదికలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే, దేశంలోని వివిధ సంస్థల యాజమాన్యాల్లో 90 శాతానికి పైగా మేనేజ్‌మెంట్లు తమ సంస్థల్లో పనిచేయడానికి ఇంగ్లీషు నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు మరో సర్వేలో తేటతెల్లమైంది. వాస్తవంగా కూడా రాష్ట్రంలోని బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఆంగ్ల నైపుణ్యాలున్న వారు మాత్రమే ఉద్యోగావకాశాలను అందుకోగలుగుతున్నారు. తెలుగు మాధ్యమంలో డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఆంగ్ల నైపుణ్యాలు కొరవడి అవకాశాలు దక్కడంలేదు. 

తెలుగు మీడియంలో తగ్గుతున్న అడ్మిషన్లు
ఈ నేపథ్యంలో.. డిగ్రీ కోర్సుల్లో క్రమేణా తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు కోరుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. 2020–21 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రవేశాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.62 లక్షల మందికి ఉన్నత విద్యా మండలి సీట్లు కేటాయించింది. వీరిలో 65,981 మంది తెలుగు మాధ్యమంలో చేరిన వారు. వీరిలో 24,007 మంది బీఏ, 16,925 మంది బీకాం, 24,960 మంది బీఎస్సీ, 89 మంది ఇతర కోర్సులను ఎంపిక చేసుకున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు పెద్దగా రాకపోవడంతో గత కొన్నేళ్లుగా తెలుగు మాధ్యమం కోర్సుల్లోని సీట్లు 10 శాతం కూడా భర్తీ కావడంలేదు. దీంతో పలు కాలేజీలు ఆయా కోర్సుల నిర్వహణపై విముఖత చూపుతున్నాయి. ఫలితంగా 558 కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమాలుగా మార్చుకున్నాయి.

ఈ నేపథ్యంలో..  రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే,  ఇప్పటికే తెలుగు మాధ్యమంలో చేరిన విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని యధాతథంగా కొనసాగించుకోవచ్చు. వారి మాధ్యమంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతారు. 

చేరికలు లేని కాలేజీలకు సీట్ల కేటాయింపు నిల్‌
రాష్ట్రంలో అత్యుత్తమ విద్యా బోధనను అందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి పలు చర్యలు చేపడుతోంది. కనీస ప్రమాణాలు లేకపోవడంతో పాటు గత కొన్నేళ్లుగా చేరికల్లేకుండా కొనసాగుతున్న డిగ్రీ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో సీట్ల కేటాయింపును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇలాంటి కాలేజీలకు నోటీసులు జారీచేసింది.

రాష్ట్రంలో మొత్తం 1,551 కాలేజీలుండగా వాటిలో 0–10 శాతం మాత్రమే చేరికలున్న కాలేజీలు 502 ఉన్నాయి. 10–20 శాతంలోపు చేరికలున్నవి 490 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. చేరికల్లేని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఒక్క విద్యార్థీ చేరని 40 కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో పూర్తిగా సీట్ల కేటాయింపును నిలిపివేయనుంది. అలాగే, 257 కాలేజీల్లో విద్యార్థులు చేరని 454 కోర్సులకు కూడా ఈ ఏడాది చేరికలు నిలిపివేస్తోంది. ఇలా చేరికల్లేని 112 కోర్సులను పలు కాలేజీలు ఉపసంహరించుకున్నాయి.

23 నుంచి వెబ్‌ ఆప్షన్లు
ఇక రాష్ట్రంలోని అన్ని నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈనెల 15న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 22తో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. 23–26 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి 29న మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 

గత ఏడాది డిగ్రీ ప్రవేశాలు ఇలా..
     జిల్లా               మహిళలు             పురుషులు           మొత్తం             తెలుగు మీడియం    
అనంతపురం          10,293                12,034                22,327                   4,184    
చిత్తూరు                  12,685                16,228                28,913                   2,737    
తూర్పు గోదావరి      14,575                13,291                27,866                   8,077    
గుంటూరు                  9,350               11,347                20,697                    4,005    
కడప                         7,120                  7,971               15,091                    2,320    
కృష్ణా                         9,390                  9,346               18,736                    3,569    
కర్నూలు                 10,634                12,605               23,239                    5,597    
నెల్లూరు                    6,486                  7,040               13,526                    1,027    
ప్రకాశం                     7,591                  8,434               16,025                    3,160    
శ్రీకాకుళం                 9,546                  8,563               18,109                  11,280    
విశాఖపట్నం          11,672                 11,839               23,511                    6,986    
విజయనగరం           7,807                   8,338              16,145                    8,512    
పశ్చిమ గోదావరి       8,510                    8,688              17,198                    4,527
మొత్తం                 1,25,659              1,35,724           2,61,383                 65,981

ఎయిడెడ్‌ కాలేజీల్లోని సీట్లు..
మరోవైపు.. ప్రభుత్వ ఎయిడ్‌తో నడుస్తున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో గత కొంతకాలంగా చేరికలు భారీగా తగ్గిపోయాయి. ఈ సంస్థల్లోని అన్‌ ఎయిడెడ్‌ సెక్షన్లలో కొంతమేర చేరికలుంటున్నా ఎయిడెడ్‌ సెక్షన్లలో సీట్లు భర్తీ కావడంలేదు. ఈ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఈ నేపథ్యంలో.. వీటిని ప్రభుత్వంలోకి తీసుకుని ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయా యాజమాన్యాల అంగీకారాన్ని కోరింది.

అయితే, కొన్ని సంస్థలు అంగీకరించగా కొన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో చేరికల్లేని ఈ కాలేజీల్లోని ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. ఇక నుంచి ఆ కాలేజీలు అన్‌ ఎయిడెడ్‌ కాలేజీల కింద కొనసాగుతాయి. ఈ యాజమాన్యాలు అన్‌ ఎయిడెడ్‌ సెక్షన్లను ఏ మేరకు కొనసాగిస్తాయో ఆయా వర్సిటీలకు తెలియజేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-degree-courses-will-offered-entirely-english-2021-22-academic-year