ఆంధ్ర రొయ్య 61 దేశాలకు ఎగుమతి

  • ఎగుమతుల విలువ రూ.16,183 కోట్లు
  • మన బియ్యమూ 45 దేశాలకు ఎగుమతి
  • కేరళ నుంచి బంగారం.. హరియాణ నుంచి బాస్మతి బియ్యం
  • గుజరాత్, కర్ణాటక, బిహార్‌ నుంచి హైస్పీడ్‌ డీజిల్‌
  • వజ్రాల ఎగుమతిలో మహారాష్ట్ర టాప్‌
  • తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి భారీగా మందుల ఎగుమతులు
  • అల్యూమినియం ఎగుమతుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌
  • మాంసం ఎగుమతుల్లోయూపీదే అగ్రస్థానం
  • డీజీసీఐఎస్‌ నివేదిక–2020లో వెల్లడి 

  ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మీసం మెలేస్తోంది. నాణ్యమైన, అత్యంత రుచికరమైన రొయ్యలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందటంతో ప్రపంచంలోని 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఎగుమతుల విలువ అక్షరాలా రూ.16,183 కోట్లు. డీజీసీఐఎస్‌ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

  దేశంలోని ఏ రాష్ట్రాలు వేటిని ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయో 2020 సంవత్సర నివేదికలో డీజీసీఐఎస్‌ పేర్కొంది. రొయ్యలతోపాటు ఫెర్రో–సిలికా, మాంగనీస్‌ మన రాష్ట్రం నుంచి 69 దేశాలకు ఎగుమతి చేశారు. రాష్ట్రం నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి కాగా.. వాటి విలువ రూ.3,015.9 కోట్లుగా నివేదిక వెల్లడించింది. పొగాకు, క్యాప్సికం వంటివి కూడా మన రాష్ట్రం నుంచి భారీగానే ఎగుమతి అయ్యాయని తెలిపింది.

  కేరళ నుంచి బంగారం.. హరియాణ నుంచి బాస్మతి రైస్‌
  కేరళ నుంచి ఎక్కువ స్థాయిలో బంగారం ఎగుమతి అయినట్టు వెల్లడైంది. ఎనిమిది దేశాలకే ఇది ఎగుమతి అయినా దీని విలువ అక్షరాలా రూ.43,233.83 కోట్లు. కేరళ నుంచి జీడిపప్పు 47 దేశాలకు ఎగుమతి అయింది. బిర్యానీకి ప్రసిద్ధి గాంచిన బాస్మతి రకం బియ్యం హరియాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. 121 దేశాలకు రూ.16,443.09 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని హరియాణ ఎగుమతి చేసింది.

  గుజరాత్‌ నుంచి 48 దేశాలకు రూ.77,325.1 కోట్ల విలువైన హైస్పీడ్‌ డీజిల్‌ను ఎగుమతి చేశారు. మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో అతిపెద్ద విలువ కలిగినది డైమండ్స్‌ కాగా.. మహారాష్ట్ర నుంచి 77 దేశాలకు డైమండ్స్‌ ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 1.70 లక్షల కోట్లు. ఢిల్లీ నుంచి టర్బో జెట్స్‌ పెద్దఎత్తున ఎగుమతి కాగా.. వీటి విలువ రూ.11,600 కోట్లుగా డీజీసీఐఎస్‌ తేల్చింది. జమ్ముకశ్మీర్‌ నుంచి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలను ఎక్కువగా ఎగుమతి చేశాయి. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-comes-first-marine-exports-especially-prawns-1386584