ఆగస్టు 15 నుంచి పాఠశాలలు ప్రారంభం

  నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్‌ సమీక్ష

  ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

  నూతన విద్యా విధానం
  నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క స్కూల్‌ కూడా మూసివేయకూడదని, ఒక్క టీచర్‌ను కూడా తొలగించకూడదని ఆదేశించారు. నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులను యథావిధిగా కొనసాగించాలని, షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

  టీచర్లకు వ్యాక్సినేషన్‌
  ఆగష్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగష్టులోనే విద్యా కానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలివిడత పనులు పూర్తైన పాఠశాలలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-review-nadu-nedu-and-jagananna-vidya-kanuka-1376885