- 7 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా ఇస్తున్నాం
- ఇప్పటికే కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో పూర్తయింది.. 2,3 రోజుల్లో మిగిలిన చోట్లా పూర్తి
- ఆధార్ లేని వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్న ఈనాడు కథనం తప్పు
- అవసరాలకు సరిపడా సిబ్బంది భర్తీ
- హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
కరోనా టీకా పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని, ఆధార్ లేదన్న కారణంతో ఏ ఒక్కరికీ వ్యాక్సిన్‌ను తిరస్కరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. వ్యాక్సిన్ ఇవ్వటానికి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా వ్యాక్సిన్ ఇస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వివరించారు. ఆధార్ లేని వృద్ధులకు వ్యాక్సిన్ వేయడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనారు తప్పన్నారు. ఆధార్ లేకపోయినా వ్యాక్సిన్ వేస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లోనూ వ్యాక్సినేషన్ మొదలైందని, రెండు మూడు రోజుల్లో అక్కడ కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు.
ఆరోగ్యశ్రీలో ఆ చిన్నారులకు చికిత్స
కరోనా అనంతరం చిన్నారుల్లో వచ్చే మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్ఐ)ను హైకోర్టు సూచన మేరకు ఆరోగ్యశ్రీలో చేర్చామని సుమన్ నివేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా వైద్య సిబ్బంది నియామకాలను పూర్తి చేసినట్లు వివరాలను కోర్టుకు సమరి్పంచారు.
కేసులను బట్టి ఇంజక్షన్ల కేటాయింపు..
బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాల్లో కేసుల లోడ్‌ను బట్టి కేటాయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు 34,010 వయల్స్ కేటాయించాలని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.
ఏపీకి ఒక్కరోజే 12,410 ఇంజక్షన్లు
రాష్ట్రాలవారీగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కేటాయింపులపై మెమో దాఖలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ నివేదించారు. ఈ నెల 7వ తేదీ వరకు అన్ని రాష్ట్రాలకు 3.91 లక్షల యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లను కేటాయించామన్నారు. ఈ నెల 4వతేదీన ఒక్క రోజే 1.21 లక్షల ఇంజక్షన్లు కేటాయించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 21,600 ఇంజక్షన్లకు అదనంగా బుధవారం 12,410 ఇంజక్షన్లను కేటాయించామని వివరించారు.
భారీగా పరీక్షలు…25 శాతం అదనపు సిబ్బంది భర్తీ…
రాష్ట్రంలో కరోనా పరీక్షల గణాంకాలను ధర్మాసనం ముందుంచారు. రోజుకు 1.10 లక్షల పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. ఈ నెల 9న ఒక్క రోజే 98 వేల పరీక్షలు నిర్వహించామని చెప్పారు. శాశ్వత పరీక్ష కేంద్రాలు కూడా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో 26,325 మంది వైద్య, నర్సింగ్ ఇతర సిబ్బందిని భర్తీ చేశామన్నారు. కోవిడ్ చికిత్సలో భాగమైనందుకు వీరికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం అదనపు సిబ్బందిని నియమించామని, ప్రస్తుత అవసరాలకు మించే సిబ్బంది ఉన్నారని సుమన్ తెలిపారు.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/aadhaar-not-mandatory-get-corona-vaccine-says-ap-govt-high-court-1370321