ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్టు

  • మలేషియా డీఎక్స్‌ఎన్‌ గ్రూపు భారీ పెట్టుబడులు
  • ఏటా లక్ష మంది పర్యాటకులు, 2,000 మందికి ఉపాధి 

మలేషియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ గ్రూపు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్‌ సమీపంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా సున్య ఇంటర్నేషనల్‌ పేరుతో ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. నాగార్జున కొండకు సమీపంలో పల్నాడు జిల్లా మాచర్ల వద్ద 110 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి డీఎక్స్‌ఎన్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనలు సమర్పించింది.javascript:false

లీజు విధానంలో 99 ఏళ్లకు 110 ఎకరాలు కేటాయించాల్సిందిగా శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ సెంటర్‌లో 1,000 మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా మందిరంతో పాటు 7 స్టార్‌ హోటల్‌ సదుపాయాలతో రిసార్ట్, 50 పడకల హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఔషధ వనం, తద్వారా ఆయుర్వేద మందులను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా లక్ష మంది పర్యాటకులు సున్య ఇంటర్నేషనల్‌ సెంటర్‌ను సందర్శిస్తారని, ఇందులో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. డీఎక్స్‌ఎన్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన గోవింద్‌ రెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/spiritual-tourism-project-sagar-investments-dxn-group-1472862