ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్‌

  • త్వరలో పోర్టల్‌ రూపొందించనున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే టికెట్ల బుకింగ్‌ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఈ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ నిర్వహిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ రూపొందించడం, అమలును పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ప్రతినిధి, ఏపీటీఎస్‌ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/booking-movie-tickets-through-online-portal-ap-1394299