ఆన్‌లైన్‌ పశువుల సంత

  • ఫోన్‌ ద్వారా గేదె ఫొటోను పంపిస్తున్న వైనం
  • కరోనా వల్ల మూతపడిన సంప్రదాయ వారపు పశు సంతలు
  • సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న రైతులు, వ్యాపారులు
  • సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు
  • ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ల ద్వారా నగదు చెల్లింపులు

  కరోనా మహమ్మారి వ్యాపారాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఆధునిక సాంకేతికతను వినియోగించి గట్టెక్కుతున్నారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లకు రైతులు, వ్యాపారులు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పశువుల క్రయవిక్రయాలకు వారపు సంతలు జరిగేవి. ఈ సంతలకు ఎక్కువగా జెర్సీ, దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలు, దేశవాళీ గేదెలు, దుక్కి పశువులు, దున్నపోతులు, ఒంగోలు గిత్తలు తదితర రకాలకు చెందిన పశువులు వస్తుంటాయి. జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పశువుల వ్యాపారం జరిగేది.

  కరోనా కారణంగా వారపు సంతలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు ఆన్‌లైన్‌ ద్వారా పశువుల క్రయవిక్రయాలు చేపట్టారు. ఈ విధానం ఈ మధ్యే ప్రారంభం కాగా.. జిల్లాలో నెలకు రూ.3 కోట్ల విలువైన పశువుల అమ్మకాలు ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని అలమండ, మానాపురం, పార్వతీపురం, అచ్యుతాపురం, బొద్దాం, సాలూరు, కూనేరు, కందివలసలో వారపు పశు సంతలు జరిగేవి. ఈ సంతల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి పశువులు కొనుగోలు చేసేవారు. సంతలు మూతపడటంతో ఈ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లో సాగుతున్నాయి.

  ప్రతి సోమవారం జరిగే అలమండ పశువుల సంత 

  ఆన్‌లైన్‌లో ఇలా..
  ఔత్సాహికులైన కొందరు పశువుల కొనుగోలుదారులు, అమ్మకందారులు, రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద ఉన్న పశువులను వీడియో, ఫొటోలు తీసి వాటి ధర, ఇతర వివరాలను ఆ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. నచ్చిన వారు సంబంధిత రైతులు లేదా వ్యాపారులతో చాటింగ్‌ చేసి పశువుల్ని బేరమాడి కొంటున్నారు. కొందరైతే ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విక్రయిస్తున్నారు. దళారులు సైతం పశువుల్ని విక్రయించే రైతుల వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న పశువును వీడియో, ఫొటోలు తీసి ఆ పశువు వివరాలు, ధరను వ్యాపారులకు వాట్సాప్‌ ద్వారా పంపిస్తున్నారు. ఇలా పశువును కొనుగోలు చేసిన వ్యాపారులు లేదా వ్యక్తులు నగదును ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా చెల్లిస్తున్నారు. పశువుల్ని కొనుగోలు చేసిన వారికి ట్రక్కులు, ఇతర రవాణా వాహనాల్లో వాటిని పంపిస్తున్నారు.

  ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం
  కరోనా వల్ల పశువుల సంతలు జరగడం లేదు. చాలా రోజులపాటు పశువుల అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఫోన్ల ద్వారా పశువుల అమ్మకాలు చేస్తున్నాం. రైతుల వద్ద ఉన్న పశువుల వివరాలు, ఫొటోలు, వీడియోలు తీసి గుంటూరు, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన సంతల్లో పాత పరిచయాలు ఉన్న వారికి పంపిస్తున్నాం. వారు వీటిని చూసి నచ్చితే డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు చెల్లిస్తున్నారు.
  – కె.బలరాం, పశువుల వ్యాపారి

  కొట్టాల వద్దే అమ్మకాలు
  సంతలు జరక్కపోవడంతో కొట్టాల వద్దే పశువుల అమ్మకాలు చేస్తున్నాం. మాకు తెలిసిన మధ్యవర్తులు వచ్చి మా దగ్గర ఉన్న పశువును ఫోన్‌లో ఫొటో తీసి పంపిస్తారు. మాకు నచ్చిన ధర వస్తే అమ్ముతాం. కొనుగోలు చేసిన వారు ఫోన్‌ పే ద్వారా డబ్బులు పంపి పశువుల్ని తీసుకువెళ్తున్నారు.
  – బి.సూర్యనారాయణ, రైతు

  ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం
  ఆన్‌లైన్‌ ద్వారా పశువుల అమ్మకాలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. కొంతమందికి దీనిపై అవగాహన లేదు. అవగాహన ఉన్న వాళ్లు మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా పశువుల అమ్మకాలు జరిపిస్తున్నారు. 
  – పిల్లల సత్యం, పశువుల వ్యాపారి