ఆప్కోలో అద్భుతమైన చేనేత డిజైన్లు 

  • 50 చేనేత సొసైటీలకు చెందిన వస్త్రాలు విక్రయించేలా ఏర్పాట్లు
  • ఈనెల 18 నుంచి కొత్త విధానానికి శ్రీకారం
  • విజయవాడ ఆప్కో మెగా షోరూంలో ప్రయోగాత్మకంగా అమలు
  • ఆధునిక డిజైన్లకు మార్కెటింగ్‌ కల్పించడమే లక్ష్యం
  • ప్రతి నెలా ‘వస్త్ర ప్రదర్శన’ ద్వారా విస్తృత ప్రచారం  

వస్త్ర ప్రేమికులకు అత్యాధునిక డిజైన్లతో కూడిన మరింత నాణ్యమైన వ్రస్తాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కో సంస్థ ‘కన్‌సైన్‌మెంట్‌’ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం పేరెన్నికగన్న చేనేత వ్రస్తాలను ఉత్పత్తి చేస్తున్న 50 సొసైటీలకు ఆప్కో షోరూమ్‌లలో చోటు కేటాయించనుంది. ఈ నెల 18న ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రయోగాత్మకంగా విజయవాడ పిన్నమనేని పాలీ క్లినిక్‌ రోడ్డులోని ఆప్కో మెగా షోరూంలో అమలులోకి తీసుకురానుంది.

చేనేతలో బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చీరలు, అత్యాధునిక వస్త్రాలను తొలి దశలో అందుబాటులోకి తెస్తారు. ఉప్పాడ, చీరాల కుప్పటం పట్టు, మంగళగిరి చేనేత, వెంకటగిరి శారీ, ధర్మవరం జరీ బుటా తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడన కలంకారీ, పొందూరు ఖద్దరు వ్రస్తాలను కూడా ఆప్కో విక్రయించనుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను కూడా విక్రయించనుంది. నూతన డిజైన్‌ వ్రస్తాలకు మర్కెట్‌లో డిమాండ్‌ వచ్చేలా ప్రతి నెలా ‘వస్త్ర ప్రదర్శన(పాప్‌ ఆప్‌ షో)’ నిర్వహించనుంది.

నేతన్నకు ఎంతో మేలు.. 
‘కన్‌సైన్‌మెంట్‌’ విధానంతో నేతన్నకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు నేతన్నలు అత్యాధునిక డిజైన్‌లు, ఖరీదైన వ్రస్తాలను ప్రైవేటు క్లాత్‌ షోరూమ్‌లకే విక్రయించేవారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు వాటిని అమ్మిన తర్వాతే డబ్బులు ఇచ్చేవారు. ఆప్కో ద్వారా అమ్మితే ఏ నెల డబ్బు ఆ నెలలోనే చెల్లిస్తుంది. చేనేత సొసైటీల ప్రతినిధుల సమక్షంలోనే విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటుంది.

చేనేతకు ఊతమిచ్చేలా చర్యలు 
రాష్ట్రంలో చేనేత రంగానికి మేలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ అనేక చర్యలు చేపట్టారు. ఏటా ‘నేతన్న నేస్తం’ అందిస్తున్నారు. సీఎం జగన్‌ స్ఫూర్తితో ఆప్కో ద్వారా కన్‌సైన్‌మెంట్‌ విధానం అమల్లోకి తెచ్చి చేనేత రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు చేపట్టాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి 50 చేనేత సొసైటీల ఉత్పత్తులను విక్రయిస్తాం. ఆ సొసైటీల ప్రతినిధులనే సేల్స్‌మెన్‌గా నియమించుకునే అవకాశం కల్పిస్తాం. బిల్లులను ఏ నెలకు ఆ నెల చెల్లించేలా పటిష్ట వ్యవస్థను తెస్తాం. తద్వారా చేనేత వ్రస్తాల ఉత్పత్తి పెరిగి.. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. లాభాపేక్ష లేకుండా ఆప్కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. 
– చిల్లపల్లి మోహనరావు, ఆప్కో చైర్మన్‌  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/consignment-policy-apco-boost-handloom-sector-1477335