ఏపీలో మొత్తం అన్నీ కలిపి 62,459 స్కూళ్లు ఉన్నాయి. 70,41,988 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలల్లో పిల్లలకు కంటికి సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో కంటి జబ్బులేమైనా బయటపడితే వాటికి ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ పథకం కింద తగిన చికిత్స అందిస్తున్నారు. ‘కంటి వెలుగు’లాగే పిల్లల్లో వినికిడి సమస్యలను గుర్తించేందుకు కూడా విస్తృతంగా స్క్రీనింగ్ నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. వినికిడి సమస్యపై స్క్రీనింగ్ నిర్వహించాక, అవసరమైన పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించేందుకు తగిన పరికరాలు, మౌలిక సదుపాయాలు, వాటి నిర్వహణ విధానంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశించారు కూడా. ఈ సమస్యపై విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలనీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే సదుపాయం ప్రతి బోధనాసుపత్రిలోనూ ఉండేలా చూడాలనీ సీఎం సూచించారు. ఈ మేరకు ప్రతి దశలోనూ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తయారు చేయాలని ఆదేశించారు.
సర్జరీ అవసరం లేని వారికి అందించాల్సిన పరికరాల గురించి కూడా ఆలోచించాలనీ, అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారనీ, వారికి కూడా ఈ పరికరాలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి అధికారులను కోరారు. కోవిడ్ 19 కారణంగా నిలిచిపోయిన కంటి వెలుగు ఆపరేషన్లను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
వైకల్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌ను మూగ-చెవిటి వైకల్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇందుకోసం కంటి వెలుగు తరహాలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని ఒక విధానాన్ని ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించడానికి కొంత పూర్వరంగం ఉంది. వైఎస్ జగన్ లోగడ నిర్వహించిన ‘ప్రజాసంకల్పయాత్ర’లో కనీసం 100 మంది తల్లిదండ్రులు వినికిడి సమస్యలతో బాధపడుతున్న తమ పిల్లలతో వచ్చి ఆయనను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఆ తర్వాత వారందరికీ వైఎస్ జగన్ ఆపరేషన్లు చేయించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు రోజుల్లోనే ఆయన ఈ ఆపరేషన్లు చేయించడం విశేషం. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వెల్తుర్ల చినఓబులేసు, రాణమ్మ దంపతుల కుమారుడు సందీప్‌కు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉచితంగా చేయించారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. అలా ఈ వైకల్యంతో బాధపడేవారికి అండగా ఉండాలని ఆయన ఆనాడే నిర్ణయించుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టాక వైఎస్ జగన్ ఈ సమస్యపై దృష్టి సారించారు. కొంత కసరత్తు చేశారు. కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చెవిటి – మూగ వైకల్యాలను నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు అవుతున్న విధానాలపై చర్చించారు. చిన్నారులకు వివిధ దశల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు ఈ పరీక్షలను కూడా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎంఆర్ఐ కంపాటిబిలిటీ, ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించే విషయంపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు.
పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహించి, లోపాలు గుర్తించిన వారికి పూర్తి స్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయించడంపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం శిశువులకు 1వ నెల, 3వ నెల, 6వ నెల వయసులప్పుడు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పీహెచ్‌సీలు, 104లలో కూడా పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. పరీక్షలు చేశాక లోపాలు లేకపోతే, ఆ మేరకు సర్టిఫై చేయాలని కూడా సీఎం సూచించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఘనత ఏపీకే దక్కుతుంది. నిజానికి కాక్లియర్ ఇంప్లాంట్ (cochlear implant) ఆపరేషన్ ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్స. వినికిడి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ ఆపరేషన్ చేస్తే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అందుకే సీఎం ఈ సమస్యపై దృష్టి నిలిపారు.
రెండు చెవులకూ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్

పుట్టుకతోనే చెవుడు సమస్యతో బాధ పడుతున్న ఒక పసివాడికి రెండు చెవులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను ఇటీవల గుంటూరులో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు. దేశంలోనే మొదటిసారిగా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసే సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు. దీంతో గుంటూరు ఈఎన్టీ వైద్యులు తొలిసారిగా రెండు చెవులకు ఆపరేషన్ చేసి ఆ బాబు వినికిడి సమస్యను తొలగించారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను సర్జన్ డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు నిర్వహించారు.
గుంటూరుకు చెందిన పఠాన్ ఆరిఫ్‌ఖాన్, రిహానా దంపతుల రెండో సంతానం హర్షద్‌ఖాన్ (3)కు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. తల్లిదండ్రులు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావును సంప్రదించగా ఆరునెలల కిందట ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత రెండునెలల కిందట హర్షద్‌ఖాన్ తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించగా ఆయన రెండో చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.
లోగడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రెండు చెవులకూ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని బాలుడికి ఉచితంగా ఆపరేషన్ చేశారు. వైద్యులు ఆరునెలల కిందట ఆ బాలుడి ఒక చెవికి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత 2020 నవంబర్ 30న రెండో చెవికి కూడా విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. కాగా, తమ బాబు ఆపరేషన్ విషయంలో ఉదారంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
అలా ఇప్పుడు రాష్ట్రంలోని పిల్లలందరికీ వినికిడి సమస్యలకు సంబంధించిన స్క్రీనింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్క్రీనింగ్‌తో పాటు ఉచిత చికిత్స కూడా అందించాలని నిర్ణయం తీసుకోవడం సీఎం వైఎస్ జగన్ సంక్షేమ దృష్టికి ఒక తార్కాణం.