ఆరోగ్యకరమైన సేంద్రియ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

కరోనా (Corona Virus) వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. చాలామంది రోజువారీ తీసుకునే ఆహారాల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా చిరుధాన్యాలవాడకం ఇటీవల పెరిగింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల (Millets) సేంద్రీయ సాగును (Organic Forming)  ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రజల ఆరోగ్య స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పోషకాహార లోపాలను అధిగమించేలా బయోఫోర్టిఫైడ్‌ ఫుడ్స్‌ అంటే ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సాంప్రదాయ ఆహార పదార్థాలకు చోటుండేలా ప్రజలకు, వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ సేంద్రియ ఉత్పత్తులను నెట్ వర్కింగ్ సంస్థల ద్వారా ప్రజలకు చేరవేసేలా కార్యాచరణ రూపొందిస్తారు.

ప్రజల్లో సాధారణంగా లోపించే సూక్ష్మపోషకాలైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12 ఉన్న ఫోర్టిఫైడ్‌ సూక్ష్మపోషకాలు ఆహారంలో ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలు సాగవుతుండగా.. వచ్చే మూడేళ్లలో రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి చిరుధాన్యాలు సాగును పెంచనున్నారు.

రాష్ట్రంలో కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు ఎక్కువగా సాగవుతాయి. చిరుధాన్యాలన్నింటిలోనూ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొర్రలతో నరాలకు శక్తి, మానసిక దృఢత్వం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, పార్కిన్సన్, మూర్ఛ రోగాల నుంచి విముక్తి కలిగిస్తాయి. సంతాన లేమి సమస్యను అధిగమించేందుకు సామలు తోడ్పడతాయి. అండాశయం, వీర్య సమస్యలు, పీసీవోడీ, ఊబకాయ సమస్యలను నివారిస్తాయి. అయితే అండు కొర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టి వండుకోవాలి. మిగతా చిరు ధాన్యాలను రెండు గంటలైనా నానబెట్టాలి. థైరాయిడ్‌ సమస్యలకు చిరు ధాన్యాలు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. ఊదలు శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. లివరు, కిడ్నీ, ఎండ్రోక్రెయిన్‌ గ్లాండ్స్‌ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే కామెర్లను తగ్గిస్తాయి. అరికలు రక్తశుద్ధికి తోడ్పడటంతో పాటు రక్త హీనత, డయాబెటిస్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

ప్రభుత్వం ప్రణాళిక ఇదే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, కొత్తగా నీటి పారుదల వసతి కల్పిస్తారు. సేంద్రియ ఎరువుల వాటకంతో భూసారాన్ని పెంచేలా చేస్తారు. రైతులు పండించిన ఉత్పత్తులు పొలాల నుంచి నేరుగా మార్కెట్లకు చేరేవిధంగా వ్యవస్థను ఏర్పాటు చ్స్తారు. ఇలాంటి చర్యలతో రానున్న కాలంలో ఆహార ధాన్యాలు.. ప్రత్యేకించి చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సుస్థిర వ్యవసాయం, సేంద్రియ సాగు కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ‘ప్రతి నీటి చుక్కకూ అదనపు పంట’ ‘పరంపరాగత్‌ కృషీ వికాస్‌ యోజన’ విజయవంతంగా అమలయ్యేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతుంది. చిరుధాన్యాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర ఇస్తోంది. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలనూ ప్రవేశపెట్టింది.

Source: https://telugu.news18.com/news/andhra-pradesh/andhra-pradesh-government-to-encourage-millets-cultivation-in-the-state-full-details-here-prn-1055840.html