ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

  • ఆర్టీసీ ఉద్యోగులకు ‘టెర్మినల్‌ బెనిఫిట్స్‌’
  • ఇక నేరుగా లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పదవీవిరమణ చేసిన, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాల నుంచి వైదొలగిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2020, జనవరి 1 తర్వాత రిటైరైన, ఉద్యోగాల నుంచి వైదొలగిన వారికి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. వారికి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్‌ హెడ్‌ నంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకున్న ఈ ప్రత్యేక అకౌంట్‌ హెడ్‌ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకూ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నేరుగా లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులకూ ఈ అవకాశం కలిగింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను వర్తింపజేసింది. ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. కారుణ్య నియామకాల అంశాన్ని పరిశీలిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుండటంపై సంతోషం వ్యక్తమవుతోందని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.  

సీఎం వైఎస్‌ జగన్‌కు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కృతజ్ఞతలు 
వినాయక చవితి నాడు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించిందంటూ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఏపీ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా ఆర్టీసీలో పదోన్నతులు కూడా చేపడుతున్నారని  పేర్కొన్నారు. తమ అభ్యర్థన మేరకు ఉత్తర్వులు వెలువరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/terminal-benefits-apsrtc-employees-1394552