ఆర్బీకేలకు జాతీయస్థాయి ప్రశంసలు 

ఆర్బీకేల కోసం చాన్నాళ్లుగా వింటున్నాం. చాలా మంచి ఆలోచన. వీటిద్వారా సంక్షేమ పథకాల అమలుతోపాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు చాలా బాగుంది. వీటిని జాతీయస్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.         
    –అమితాబ్‌కాంత్, సీఈవో, నీతి ఆయోగ్‌ 

వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల ఆలోచన వినూత్నంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వీటిద్వారా రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న తీరు అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అభినందనలు.     
    – తోమియో షిచిరీ, భారత ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేల) జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల ఏర్పాటు, వాటి పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో)తో పాటు నీతి ఆయోగ్‌ ఆహ్వానం మేరకు వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య జాతీయస్థాయిలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. న్యూఢిల్లీలో తొలుత ఎఫ్‌ఏవోలోను, తర్వాత నీతి ఆయోగ్‌లోను ఆమె ఇచ్చిన ప్రజంటేషన్‌ పట్ల వారు అమితాసక్తిని ప్రదర్శించారు. ఆర్బీకేలు ఎప్పుడు ప్రారంభించారు. వాటిద్వారా ఏయే సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనల నుంచి.. 
ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని చెప్పారు. ఇవి ఆయన మానస పుత్రికలని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. వాటిలో స్మార్ట్‌టీవీ, డిజిటల్‌ లైబ్రరీ, కియోస్క్, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్‌ కిట్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాం. అనుభవం, నైపుణ్యతగల 14 వేలమందికి పైగా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ద్వారా ఆర్బీకేలు కేంద్రంగా గ్రామస్థాయిలో విత్తు నుంచి విపణి వరకు రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్నాం.

సీజన్‌కు ముందుగానే ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచుతున్నాం. కియోస్క్‌లో బుక్‌ చేసుకున్న గంటల్లోనే వాటిని డోర్‌ డెలివరీ చేస్తున్నాం. ఆర్బీకేలనే పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దాం. వీటికి అనుబంధంగా వైఎస్సార్‌ యంత్ర సేవాకేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. పంటల నమోదు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని ఆమె వివరించారు.  

సేంద్రియ పాలసీకి టెక్నికల్‌ పార్టనర్‌గా ఉంటాం 
రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని పూనం మాలకొండయ్య చెప్పారు. ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ తీసుకొస్తున్నామని, ఇందుకోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఎఫ్‌ఏవో కంట్రీ డైరెక్టర్‌ షిచిరీ మాట్లాడుతూ తప్పకుండా సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. టెక్నికల్‌ పార్టనర్‌గా కూడా ఉంటామని తెలిపారు. ఆర్థికంగా కూడా చేయూత ఇస్తామన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, పనితీరు కోసం ఐక్యరాజ్యసమితికి కూడా నివేదిస్తామని చెప్పారు.

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ మాట్లాడుతూ ఆర్బీకేల ప్రయోగం మంచిదేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై జాతీయస్థాయిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/national-level-appreciation-rbks-andhra-pradesh-1403772