ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం

  • 18 జిల్లాల్లో పూర్తయిన మ్యాపింగ్‌.. 20లోగా మిగిలిన జిల్లాల్లో కూడా.. 
  • ఇక నుంచి పీఏసీఏస్‌ల ద్వారా కౌలురైతులకు రుణాలు
  • ఇప్పటికే 4.5 లక్షల మందికి పంటసాగు హక్కు పత్రాల జారీ
  • సీసీఆర్సీ కార్డుల్లేని వారితో జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల ఏర్పాటు
  • ఈ ఏడాది కనీసం రూ.4వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం 

రైతుల పరపతిని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)తో అనుసంధానిస్తోంది. ఇప్పటికే ఆర్బీకే స్థాయిలో పీఏసీఎస్‌ల ద్వారా రైతుక్షేత్రాల వద్దే పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విషయంలో సర్కారు మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను–పీఏసీఎస్‌లతో అనుసంధానించడం ద్వారా కౌలు, సన్న, చిన్నకారు రైతులకు పరపతి సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది.

కౌలురైతుకు రుణం అందించడమే లక్ష్యంగా.. 
ఏపీలోని 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట కొనుగోళ్ల వరకు ఎక్కడికక్కడ రైతులకు సేవలందిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలూ అందిస్తున్నారు. మెజారిటీ కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితి. దీనికి చెక్‌పెడుతూ గ్రామస్థాయిలో అర్హతగల ప్రతీ కౌలుదారునికి రుణం అందించడమే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో ఉన్న 2,037 పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే 18 జిల్లాల పరిధిలో మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ నెల 20లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

4.5లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సీ కార్డులు 
ఇక 2022–23 వ్యవసాయ సీజన్‌ కోసం 5.67 లక్షల కౌలుదారులకు గుర్తింపు కార్డులు జారీచేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 4.5 లక్షల మందికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఇలా సీసీఆర్సీ (క్రాప్‌ కలి్టవేటర్‌ రైట్స్‌ కార్డు– పంటసాగు హక్కు పత్రం) ఉన్న వారితో పాటు కార్డుల్లేని వారిలో రుణాలు పొందని అర్హులను గుర్తించే బాధ్యతను బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లకు అప్పగించింది. అలాగే, కౌలుదారులను కనీసం 5 నుంచి పదిమందితో కలిపి జాయింట్‌ లయబిలిటీ గ్రూపులను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి వారికి సమీప పీఏసీఎస్‌ల ద్వారా రుణపరపతి కలి్పస్తారు. గ్రూపుల్లో ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులూ ఇస్తారు.

ప్రస్తుత సీజన్‌లో రూ.4వేల కోట్ల రుణాలు 
ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో కనీసం రూ.4 వేల కోట్ల మేర రుణాలను అందించాలన్నది లక్ష్యం. కౌలుదారులకే కాదు.. సొంత భూమి కల్గిన సన్న, చిన్నకారు రైతులకు కూడా పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ని రూపొందించారు. తమ పరిధిలోని ఈ–పంట ఆధారంగా కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులను గుర్తిస్తారు. వారు ఏ సీజన్‌లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు.. సాగు కోసం వారి ఆరి్థక అవసరాలను ఏమిటో తెలుసుకుంటారు.

వ్యవసాయ అవసరాల కోసం వారిలో ఏ ఒక్కరూ ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా కౌన్సెలింగ్‌ ఇస్తారు. వీరికి పంట రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా సాప్‌్టవేర్‌ను అభివృద్ధి చేశారు. రుణ దరఖాస్తుతో రైతుల నుంచి కేవైసీ, 1బీ, అడంగల్, ఇతర ధృవీకరణ పత్రాలను స్వీకరించి వాటిని ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పీఏసీఏస్‌లకు అప్‌లోడ్‌ చేస్తారు. ఇలా వచ్చిన దరఖాస్తులను పీఏసీఏస్‌లు నిశితంగా పరిశీలించి రుణం పొందేందుకు అర్హుడని నిర్ధారిస్తే దరఖాస్తు అందిన మూడ్రోజుల్లో పీఏసీఏస్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. కొత్త గ్రూపులకు రుణాలు అందజేసే పీఏసీఎస్‌లకు రూ.4వేల వరకు ఇన్‌సెంటివ్‌ కూడా అందజేస్తారు.

సాగుదారులందరికీ రుణ పరపతి  
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ కౌలురైతుకు రుణపరపతి కల్పించడమే లక్ష్యంగా ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో వారం పదిరోజుల్లో పూర్తిచేస్తాం. మ్యాపింగ్‌ పూర్తయిన జిల్లాల్లో రుణాలు పొందేందుకు అర్హులను గుర్తిస్తున్నాం. వారందరినీ గ్రూపులుగా ఏర్పాటుచేసి రుణపరపతి కల్పించాలని ఆదేశాలిచ్చాం. 
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/linkage-pacas-rbks-1477862