ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలతో నూతనోత్సాహం

  • మహిళా సంఘాలు దాచుకున్న డబ్బు రూ.8,706 కోట్లు
  • గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల్లో ప్రతి నెలా రూ.80 కోట్లు దాకా పొదుపు
  • సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాలతో మళ్లీ పొదుపు కార్యకలాపాలు 
  • ఇప్పటి దాకా పొదుపు చేసిన సొమ్మంతా తక్కువ వడ్డీకి బ్యాంకు ఖాతాలోనే.. వారి అవసరాలకు అధిక వడ్డీతో అదే బ్యాంకు నుంచి రుణం
  • పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక 

  రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే డ్వాక్రా మహిళల పొదుపు బిలియన్‌ డాలర్లను దాటేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బిలియన్‌ డాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. బిలియన్‌ డాలర్ల మూల ధన నిధి.. అంటే ప్రస్తుత ధరల ప్రకారం రూ.7,324 కోట్లు. ఈ మేరకు మూల ధన నిధి ఉండే కంపెనీలకు వ్యాపార రంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న మొత్తం ప్రస్తుతం రూ.8,706 కోట్లకు చేరింది. సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు ప్రతి నెలా వంద రూపాయల చొప్పున తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ మొదలైన కొత్తలో రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు చేసుకునేవారు. క్రమంగా ఆ మొత్తం రూ.వందకు పెరిగింది. సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమంది ప్రతి నెలా సమావేశమై, తమ స్థితిగతులను చర్చించుకుంటారు. అందరి సభ్యుల పొదుపును పోగు చేసి, సంఘం పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాల్లో జమ చేసుకుంటారు.

  ఈ మొత్తానికి తోడు సంఘ సభ్యుల రుణ చెల్లింపుల రికార్డు ఆధారంగా బ్యాంకులు ఆయా సంఘాలకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేస్తుంటాయి. గత ప్రభుత్వ తీరుతో డీలా ఒక్క ఏప్రిల్‌ నెలలోనే మహిళలు రూ.81.76 కోట్ల మొత్తాన్ని పొదుపు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రతి నెలా రూ.70 కోట్లకు తగ్గకుండా పొదుపు చేసుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 జూన్‌ తర్వాత నుంచి 2016 మార్చి మధ్య చాలా నెలల పాటు గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా రూ.7 లక్షల చొప్పున మాత్రమే పొదుపు చేసుకునే పరిస్థితి ఉండేది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలొకి వచ్చాక హామీని గాలికి వదిలేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు పొదుపు పట్ల ఆసక్తి చూపలేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేయడంతో వారు కార్యకలాపాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్నారు. 

  పొదుపు డబ్బును వినియోగించుకోవచ్చు..
  పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా దాచుకున్న డబ్బు ఇప్పటి వరకు బ్యాంకులో పొదుపు ఖాతాల్లో నిరుపయోగంగా ఉంటున్నట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. వారు దాచుకున్న డబ్బు రూ.8,706 కోట్లు ఉన్నా, వారు ఆ డబ్బును అలానే తక్కువ వడ్డీ వచ్చే పొదుపు ఖాతాలో ఉంచి, అధిక వడ్డీకి ఆవే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. వారి పొదుపు డబ్బుకు 4 శాతం వడ్డీ వస్తుండగా, వారు బ్యాంకుల నుంచి 10 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళలు తమ పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని మొదట సంఘంలో డబ్బు అవసరం ఉన్న మహిళలకు అప్పుగా ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవసరం మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా సెర్ప్‌ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.

  బ్యాంకులు కూడా పొదుపు సంఘాలలో డబ్బులను ష్యూరిటీగా ఉంచుకొని ఆయా సంఘాలకు కావాల్సిన మొత్తం రుణం ఇవ్వడం పరిపాటిగా కొనసాగుతోంది. కాగా, రుణ పంపిణీకి ఇబ్బంది లేకుండా పొదుపు సంఘాల మహిళలు తమ పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాలను తొలత తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఎస్‌బీఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, డీసీసీబీ బ్యాంకులు ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు సెర్ప్‌ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాలు ప్రస్తుతం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలు దాచుకున్న రూ.8,706 కోట్లను వారి అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించడం ద్వారా మహిళలు బ్యాంకు రుణాలపై ఆధార పడే పరిస్థితి తగ్గుతుంది. ఆయా సంఘాల మూల ధన నిధి మరింత పెరిగే అవకాశం ఉంది.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/savings-dwcra-women-rural-areas-ap-have-crossed-1-billion-1370760