ఇంధన ఆదా రూ. 2,350 కోట్లు!

  • పాట్‌ సైకిల్‌–2లో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత పనితీరు
  • 40 శాతం ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్ర పరిశ్రమలు
  • 3,430 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు సమానమైన ఇంధనం ఆదా
  • 1.38 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ తగ్గుదల
  • సర్టిఫికెట్లు విడుదల చేసిన కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌

  ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పొదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్‌ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్‌) పథకంలో భాగంగా సైకిల్‌–2లో 3,430 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు సమానమైన (0.295 మిలియన్‌ టన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ – ఏంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు ఉంటుంది. 1.38 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. పాట్‌ మొదటి దశతో పోల్చితే మన రాష్ట్రం పాట్‌ సైకిల్‌–2లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ తెలిపింది. మొదటి దశలో ఏపీ 0.205 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఈ ఘనత సాధించిందని బీఈఈ ప్రశంసించింది.

  ఈ మేరకు నిర్వహించిన వెబినార్‌లో ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్‌ విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంధన పర్యవేక్షణ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని వెబినార్‌లో అలోక్‌కుమార్‌ అన్నారు. బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే మాట్లాడుతూ.. పాట్‌ అమలుకు రాష్ట్రాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి ప్రత్యేక పాట్‌ సెల్‌ ద్వారా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్‌ వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతోందన్నారు. 

  దేశవ్యాప్తంగా 542 పరిశ్రమల ఎంపిక
  దేశవ్యాప్తంగా పరిశ్రమల రంగంలో 11 సెక్టార్లకు సంబంధించిన 542 పరిశ్రమలను పాట్‌ సైకిల్‌–2లో ఎంపిక చేశారు. వాటిలో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించాయి. వీటికి 57.38 లక్షల ఎనర్జీ సేవింగ్‌ సర్టిఫికెట్లను అందజేశారు. లక్ష్యాలు చేరుకోని 193 పరిశ్రమలు 36.67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పాట్‌ సైకిల్‌–1లో 8.8 ఏంటీవోఈ ఇంధనం ఆదా చేయగా.. పాట్‌ సైకిల్‌–2లో 14.08 ఏంటీవోఈ ఆదా అయ్యింది.ఆయా పరిశ్రమలు పవర్‌ ఎక్సే్ఛంజీల్లో సర్టిఫికెట్లను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పాట్‌ సైకిల్‌–2 ట్రేడింగ్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-industries-save-40-percent-energy-1391844