ఇది మంచి కాఫీలాంటి సక్సెస్ స్టోరీ Araku Coffee sustainable farming practices change the lives of tribals

  ఇది మంచి కాఫీలాంటి వార్తాకథనం. కాఫీలాంటి కథనమే కాదు, కాఫీకి సంబంధించిన కథనం కూడా.   ఇరవై ఏళ్ల కిందట విశాఖపట్టణం జిల్లాలోని అరకు వ్యాలీలో మొదలైంది ఈ కాఫీ కథ. అరకు గిరిజనుల జీవనోపాధి ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కాఫీ సాగు అద్భుత విజయాన్ని అందుకుంది.  అలా మన అరకు నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది. ఒకరకంగా బెస్ట్‌ కాఫీకి పర్యాయపదంగా కూడా మారింది. ఎందుకంటే ఇక్కడ  ప్రత్యేకమైన అరబికా (Coffea arabica) కాఫీ రకాన్ని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పండిస్తారు. ప్రపంచ తొలి కాఫీ మొక్కల రకాల్లో ఇది ఒకటి. అలా అరకు కాఫీ గింజలు మిగతా కాఫీరకాల కంటే విశిష్టమైనవి.

  అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ తన ఫుడ్ విజన్ 2050 బహుమతి కోసం ‘టాప్ 10 విజనరీ’లలో ఒకటిగా అరకు కాఫీ ప్రాజెక్టును గుర్తించడం ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేషం. అరకు కాఫీకి ఇలా పలు అంతర్జాతీయ బహుమతులు కూడా వచ్చాయి. అరకు కాఫీ రుచి గురించి చెప్పడం కన్నా దాన్ని ఆస్వాదిస్తేనే దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. అరకు కాఫీ ఇవాళ ఒక బ్రహ్మాండమైన బ్రాండ్. రంగులోను, రుచిలోను, వాసనలోను అరకు కాఫీకి పోటీయే లేదు. సాటి లేనే లేదు.

  అరకు ప్రాంతం ఆదివాసులకు నిలయం. కాబట్టి అరకులో కాఫీ తోటల పెంపకం అరకునోమిక్స్‌ (Arakunomics)గా మారింది. అది ఒక మంచి ఆర్థిక నమూనా కూడా. ఇది పునరుత్పత్తి వ్యవసాయం ద్వారా రైతులకు లాభాలతో పాటు వినియోగదారులకు నాణ్యతతో కూడిన సరుకును అందిస్తుంది. అలా కాఫీ ఇవాళ అరకు గిరిపుత్రుల జీవితాలను మార్చివేసింది. ప్రస్తుతం అరకులోని 955 గ్రామాలు కాఫీ తోటల పెంపకంలో పాల్గొంటున్నాయి. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘నాంది ఫౌండేషన్’ ఇక్కడ 14,000 మంది రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వడం ద్వారా కాఫీ ఉత్పత్తికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

  ఏటా అరకు నుండి 75 టన్నుల మేరకు కాఫీ గింజలను సేకరించడం జరుగుతోంది. అరకులోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, బయో-డైనమిక్ వ్యవసాయం, ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలో అగ్రశ్రేణి కాఫీ నిపుణుల ప్రమేయం వల్ల అరకు కాఫీ ప్రపంచ స్థాయికి చేరింది. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో సైతం అరకు కాఫీ బ్రాండ్‌తో కాఫీ షాప్‌ ఒకటి వెలిసింది. ‘నాంది ఫౌండేషన్‌’ తరఫున  మహీంద్రా గ్రూప్‌కు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది.

  ప్రస్తుతం విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) (Girijan Cooperative Corporation – GCC) కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అరకుకాఫీ పేరుతో జీసీసీ స్టాల్స్ నిర్వహిస్తుంది. కాఫీని రైతు బజార్లలో కూడా విక్రయిస్తుంది. ఇదిలావుండగా, కాఫీ తోటలను ఇంకా విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ఒక ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో ఇక్కడ కాఫీ సాగు సాగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వ కృషి వల్ల అదనంగా 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. కాగా, 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు సాగును విస్తరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం చింతపల్లి మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా రైతు సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. సిల్వర్‌ ఓక్‌ చెట్లు పెంచుతూ వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది. కాఫీ తోటల వల్ల గిరిజనులు పోడు వ్యవసాయం మానారు. దీంతో పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేకూర్చినట్లైంది.

  ఇక అరకు కాఫీ తోటల్లో పనిచేసేవారికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కాఫీ మొక్క గింజలను జాగ్రత్తగా పరిశీలిస్తూ అవి ఎర్రగా మాగిన తర్వాతే వాటిని తెంపుతారు. అపై ప్రాసెసింగ్ కోసం పంపుతారు. ఈ కాఫీ గింజలను ఏపీఎఫ్‌డీసీ కొనుగోలు చేస్తోంది. కొందరు కాఫీ రైతులు సొంత యూనిట్లలో కూడా కాఫీ పొడిని తయారు చేస్తూ విక్రయిస్తారు. ఇటీవల కోవిడ్ 19 కారణంగా కాఫీ తోటల్లో పని చేసేవారికి పని లభించక ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కానీ కొన్ని సమస్యలు ఇంకా తీరలేదు. కారణాలేవైనా ఇక్కడి గిరిజనులకు ఇంకా సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. మధ్య దళారుల వల్లే రైతులు నష్టపోతున్నారని ITDA అంటోంది. ప్రస్తుతం ITDA ద్వారా రూ. 526 కోట్ల విలువైన కాఫీ ప్రాజెక్టు అమలు అవుతోంది. కాఫీ తోటల విస్తరణ, ఆర్గానిక్ సర్టిఫికేషన్, మార్కెటింగ్ వంటి పనులను ITDA నిర్వహిస్తోంది. కాఫీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ITDA కృషి చేస్తోంది. కాఫీగింజల ప్రాసెసింగ్‌లో గిరిజనులు అనుసరిస్తున్న కొన్ని పద్ధతుల వల్ల అరకు కాఫీకి ఆశించిన ధర రావడం లేదని ITDA చెబుతోంది.

  కాఫీ ఉత్పత్తిలో ఏపీ జోరు

  2025 నాటికి అరకు వ్యాలీలో కాఫీ తోటలు 2 లక్షల ఎకరాలకు కనుక విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో, కర్ణాటక తర్వాత, ఏపీ ద్వితీయ స్థానానికి చేరుకుంటుంది. ఇప్పటికే కాఫీ తోటల విస్తీర్ణంలో తమిళనాడును వెనక్కినెట్టేసి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరింది.

  ఒక మొక్క నుంచి ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు కాఫీ గింజల దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్‌ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల దాకా పలుకుతోంది. కాగా, భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు జరుగుతున్నప్పటికీ ఎగుమతుల్లో భారతదేశం ఏడో స్థానంలో ఉంది. బ్రెజిల్ 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. వియత్నాంది రెండో స్థానం.

  ఇక కర్ణాటకలో కార్పొరేట్‌ స్థాయిలో సాగు జరుగుతుండడంతో ఎకరానికి 225 కిలోల మేరకు కాఫీ దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీతో పాటు అంతరపంటగా మిరియాల సాగు కాస్త లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు కూడా దీనిపైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. అరకులో అడవి బిడ్డలు సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీని సాగు చేస్తారు. కాఫీ మొక్కలకు సహజమైన ఆర్గానిక్ ఎరువులనే వేస్తారు. అరకు కాఫీ పేరుతో ఒక సూపర్ బ్రాండ్ స్థిరపడి ప్రసిద్ధం కావడానికి ఇదొక ప్రధాన కారణం.

  ఎప్పుడో, 1898లో ఆనాటి ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు తొలిసారిగా కాఫీ తోటలు వేశారట. అక్కడి నుండి కొంత కాలానికి గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 నాటికి కాఫీ అరకు లోయకు చేరింది. ఆనాటి నుంచి, అరకు కాఫీ రంగు, రుచి, వాసనల్లో తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక కాఫీ చరిత్రని వివరించే కాఫీ మ్యూజియం అరకులో ఉంది. ఇక్కడ స్టాళ్లను నిర్వహిస్తూ పర్యాటకులకు అరకు కాఫీ రుచిని అందిస్తూ ఉంటారు. ఈ మ్యూజియంలో కాఫీ పూర్వచరిత్రని తెలిపే చిత్రాల గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఎక్కడో ఇథియోపియాలో పుట్టిన కాఫీ మన అరకు వరకు ఎలా వచ్చిందో ఇక్కడ చూసి తెలుసుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాఫీ రుచులపై ఇక్కడ నిరంతరం రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. కాఫీకి వివిధ రకాల ఫ్లేవర్స్ కలుపుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కనుక ఘుమఘుమలాడే అలాంటి కాఫీ రుచులు ఆస్వాదించాలంటే ఒకసారి అరకు వెళ్లి రావలసిందే.