ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

  • గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల వివరాలు 
  • వచ్చే జూన్‌ నాటికి గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి 
  • అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ దిశానిర్దేశం

  నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 1, 3, 4 తేదీల్లో ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమాన్ని చేపట్టి.. రికార్డు స్థాయిలో గృహాల నిర్మాణానికి భూమిపూజలు చేయించారు. రెండ్రోజుల నుంచి లబ్ధిదారులుకు బిల్లులు చెల్లించడానికి వీలుగా వారి వివరాలను గృహనిర్మాణ శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటలకు 7,87,917 మంది లబ్ధిదారుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.

  ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్‌ గుప్తా పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్‌ వంటి వాటిని లేఅవుట్లకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు ఎన్‌.కమలాకరబాబు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎం.శివప్రసాద్, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సీఈ శ్రీరాములును ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించిన మేరకు 2022 జూన్‌ నాటికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అజయ్‌జైన్‌ అధికారులను ఆదేశించారు.   

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/special-focus-housing-construction-1377853