ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌1

  • 78 శాతం జగనన్న కాలనీల్లో పంపిణీ పూర్తి
  • ఇప్పటివరకూ 40వేల మందికి అందజేత
  • జిల్లాలో జోరుగా సాగుతున్న పండుగ
  • ఈ నెల 20 వరకూ పంపిణీకి అవకాశం

సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. సర్కారు ఆదేశిస్తోంది… అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. 

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెల 25న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

ఉత్తుర్వుల మేరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రుల చేత పట్టాల పంపి ణీ ఉత్సాహంగా సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబర్‌ 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వై,ఎస్‌.జగన్‌మోహనరెడ్డి పాల్గొని స్వయంగా పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్‌లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా రోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్ధిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్ధమ వుతున్నారు.

40వేల మందికి పంపిణీ పూర్తి 
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 72,625 మంది ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 4వ తేదీ నాటికి 39,772 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మల్యేలు పట్టాలు పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్ధిదారులకు భద్రంగా పట్టాలు అందజేస్తున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు.

911 కాలనీల్లో పట్టాల పంపిణీ 
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పట్టాల పంపిణీకోసం జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో ఏర్పాటుకు సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తయింది. ఆక్ర మిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్‌ పట్టాలకు 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, 19,572 మందికి అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్ధిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది. 

20 వరకూ పట్టాల పంపిణీ 
పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7ను గడువు  తేదీగా నిర్ధారించగా తాజాగా 20వ తేదీ వరకు పొడిగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తాం. జగనన్న కాలనీల్లో సామాజిక వసతులు కల్పించి, మురికి వాడలు లేని కాలనీలుగా తీర్చి దిద్దుతాం. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్‌ హౌసింగ్‌ను నిర్మిస్తాం. 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్, జిల్లా కలెక్టర్‌
 రాష్ట్రంలో అతి పెద్దవాటిలో ఒకటైన గుంకలాం లే అవుట్‌