‘ఈబీసీ నేస్తం’ కింద ఏడాదికి రూ.15 వేలు YS Jagan govt. releases guidelines for EBC Nestham scheme

    సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు చేయూత అందించే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, వారి గుర్తింపు ప్రక్రియపై బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు రూ. 45 వేలు ఇస్తుంది. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధి పొందుతారని అంచనా. ఈ పథకం అమలుకు  ఏడాదికి రూ.603.5 కోట్ల చొప్పున మూడేళ్లకుగాను రూ.1,810.51 కోట్లు వ్యయం కావచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులపై కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే 2020-21 నాటికి రాష్ట్రంలో మొత్తం 4,47,040 మంది అర్హులు ఉన్నారు. ఏటా వీరందరికీ రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు సాయం అందిస్తే రూ.2011.68 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఏదేమైనా లబ్ధిదారుల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తేలితేనే పథకానికయ్యే వ్యయంపై స్పష్టత వస్తుంది.

    ఈసీబీ లబ్ధిదారుల అర్హతలు

    ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. మునిసిపల్‌ ఏరియాలో 750 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు. అయితే పారిశుధ్య ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. లబ్ధిదారులకు కారు ఉండకూడదు. కానీ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో వంటివి ఉండవచ్చు. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదు. ప్రభుత్వం ఈ పథకంపై  ఆదేశాలు జారీ చేసిన రోజు నుంచి లబ్ధిదారుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత వివిధ దశల్లో పరిశీలన జరిపి జిల్లా కలెక్టర్‌ తుది జాబితాను రూపొందిస్తారు.

    కాగా, ఈ పథకం అమలు ఒక వెబ్‌సైట్‌ (navasakam.ap.gov.in) ద్వారా జరుగుతుంది. అర్హుల గుర్తింపు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రక్రియ అంతా దీని ద్వారానే నిర్వహిస్తారు. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. కాపు నేస్తం లబ్ధిదారులు, వైఎస్‌ఆర్‌ చేయూత కింద సాయం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి ఏపీ బీసీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు విడుదలవుతాయి.