- కోవిడ్ సమయంలో 6.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాల సరఫరా
- ఎఫ్సీఐ ఏపీ రీజియన్ జనరల్ మేనేజర్ అమరేష్ కుమార్
ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఇప్పటివరకు 40.47 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ప్రకటించింది. 2019–20లో ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 55.36 లక్షల టన్నుల బియ్యం సేకరించినట్లు ఎఫ్సీఐ ఏపీ రీజియన్ జనరల్ మేనేజర్ అమరేష్ కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కింద 9.2 కోట్ల మంది పిల్లలకు పోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–బి వంటి పోషకాలు కలిగిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
2021–22కి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం కింద 13.97 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కోవిడ్ దెబ్బతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.2,480 కోట్లతో 6.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపారు.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/above-40-lakh-tonnes-rice-has-been-procured-year-1376518