ఈ కాగితం నాటితే మొలకెత్తుతుంది 21Fools Promotes Innovative Plantable Seed Paper

  పర్యావరణానికి హాని చేయని విధానాలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సుస్థిరత అన్నది ఇప్పుడు దేశంలో ఒక నినాదంగా మారుతోంది. అలా గాంధేయ ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన ఒక సంస్థ పర్యావరణహితకరమైన సుస్థిరతను గురించి అవగాహన కల్పించడం ప్రారంభించింది. వేడుకగా జరుపుకునే పండుగల సందర్భాలలో సైతం పర్యావరణ స్పృహ కలిగి ఉండడమెలాగో ఈ సంస్థ మనకు నేర్పుతోంది. విత్తనాలు కూర్చిన సీడ్ ఎంబెడెడ్ పేపర్ తయారు చేయడం, దాని వాడకాన్ని ప్రచారం చేయడం ఈ అవగాహనలో భాగం. పర్యావరణం పట్ల మనలో అవగాహన పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది.

  ఇంతకీ సీడ్ ఎంబెడెడ్ పేపర్ అంటే ఏమిటి?

  ఇది ప్లాంటబుల్ సీడ్ పేపర్. అంటే విత్తనాలు నిక్షిప్తం చేసిన కాగితం. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉపయోగించిన పత్తి వ్యర్థాల నుండి తయారైన కాగితం. పత్తి నుండి తయారైన ఈ కాగితం 100% బయోడిగ్రేడబుల్. సరళంగా చెప్పాలంటే, ఉపయోగించిన తర్వాత ఈ కాగితాన్ని నాటి, కాసింత నీళ్ళు కనుక పోస్తే పత్తి మట్టిలోకి చేరిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తడం మొదలవుతుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఈ విత్తనం ఎంబెడెడ్ కాగితం నుండి ఎంచక్కా మొక్కలను పెంచుకోవచ్చు! ఒక చిన్న భారతీయ సంస్థ దీనిని తయారు చేసింది. అంతేకాదు, వినూత్నంగా రక్షాబంధన్ పండుగ జరుపుకునేందుకు విత్తన రాఖీలను కూడా ఈ సంస్థ తయారు చేయడం విశేషం. వీటిని చక్కగా నాటవచ్చు, ముచ్చటైన మొక్కలుగా పెంచుకోవచ్చు. అలాగే హోలీ పండుగ కోసం, ఈ సంస్థ  ‘హోలీ కా డబ్బా’ను తయారు చేసింది. హెర్బల్స్‌తో తయారైన రంగులు ఇందులో ఉంటాయి. విత్తనాలతో కూడిన అందమైన గ్రీటింగ్ కార్డులను సైతం ఈ సంస్థ రూపొందించింది.

  మనమంతా రోజూ ఎంతో కొంత మేరకు కాగితాన్ని ఉపయోగిస్తున్నాము. దీనికి మూలం కలప గుజ్జు. సాధారణంగా భారీ చెట్లను నరికివేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అంతమాత్రమే కాదు, రోజూ భారీ పరిమాణంలో కాగితపు వ్యర్థాలను కూడా మనం సృష్టిస్తున్నాము. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా పుట్టిందే ప్లాంటబుల్ సీడ్ పేపర్. ఈ పేపర్ పూర్తిగా పత్తివ్యర్థాలతో తయారవుతుంది. ఒకసారి వాడిన తర్వాత ఈ కాగితాన్ని నాటితే అందులోంచి చిట్టి చిట్టి పిలకలు మొలకెత్తుతాయి. 21 ఫూల్స్(21Fools) సంస్థ వ్యవస్థాపకులు దివ్యాంశు అసోపా 2014లో తొలిసారిగా భారతీయ మార్కెట్‌లోకి పత్తివ్యర్థాలతో తయారయ్యే ఈ సరికొత్త కాగితాన్ని ప్రవేశపెట్టారు. 

  “ప్లాంటబుల్ కాగితం ప్రామాణికతను సాధించేందుకు మాకు కొన్ని నెలలు పట్టింది. మొక్కగా పెరుగుతున్న కాగితాన్ని చాలా మంది మొదట నమ్మలేదు. ఒక విత్తనాన్ని మొక్కగా ఎలా ఎదుగుతుందో  మెట్రోల్లోని కార్పొరేట్లకు అవగాహన కల్పించడం ఒక సవాలుగా మారింది. కలప గుజ్జు కాగితానికి సాధారణ ప్రత్యామ్నాయంగా సీడ్ పేపర్ వాడకానికి కార్పొరేట్లను ఒప్పించడానికి మేం ప్రయత్నించాము” అని దివ్యాంశు అసోపా చెప్పారు. 

  “ఇప్పటి వరకు మేము 400లకు పైగా కంపెనీలతో కలిసి పనిచేశాము. గూగుల్ నుండి బిఎమ్‌డబ్ల్యూ వరకు, రిలయెన్స్ నుండి మారుతి వరకు, ఫ్లిప్‌కార్ట్ నుండి పెప్పర్‌ఫ్రై వరకు, ఇలా విత్తన కాగితాన్ని ఉపయోగించాలనే ఆలోచనను సూత్రప్రాయంగా ఆమోదించిన పలు ప్రసిద్ధ సంస్థలతో మేము కలిసి పనిచేశాము” అని ఆయన వివరించారు.

  ఈ సంవత్సరం (2021) నుండి, ఈ సంస్థ తమ వ్యక్తిగత ఉపయోగం కోసం సీడ్ పేపర్‌ను ఉపయోగించాలనుకునే బి2సి (business-to-consumer B2C) కస్టమర్ల కోసం కూడా ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. కస్టమర్లు ఉపయోగించుకున్నాక ఆ ఉత్పత్తులను తిరిగి తమ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించే వీలు కల్పించింది. అముద్రిత కాగితంతో పాటు ముద్రించిన గ్రీటింగ్ కార్డులు, ఎన్వలప్‌లు, డైరీలు, బుక్‌మార్క్‌లు, బ్యాగులు, ప్యాకేజింగ్ పేపర్, కోస్టర్‌లు, వెడ్డింగ్ కార్డులు మొదలైన వాటి కోసం వివిధ సైజుల్లో ఉండే షీట్లను కూడా సంస్థ తయారు చేస్తోంది.

  విత్తన కాగితాన్ని ఉపయోగించడమనేది పర్యావరణం పట్ల ఆయా సంస్థల నిబద్ధతను చాటుతుంది. అలా ఒకసారి ఈ కాగితాన్ని ఉపయోగించిన తర్వాత, ఆ సంస్థలు కలప గుజ్జు కాగితాన్ని మళ్ళీ ఉపయోగించబోరు. కనుక అసలు విత్తన కాగితం వాడకం మొదలు పెట్టడమే ఒక సవాలుగా ఉంటుంది. ఇక్కడే కార్పొరేట్లను మెప్పించి, ఒప్పించవలసి ఉంటుంది. 21 ఫూల్స్ సంస్థ గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వస్తోంది. తన ఉత్పత్తులను రూపొందించడానికి హస్తకళాకారులతో కలిసి ఈ సంస్థ పని చేస్తోంది. హానికారకం కాని పదార్థాలను మాత్రమే తమ ఉత్పత్తులలో ఉపయోగిస్తోంది. ఈ సంస్థ దృష్టిలో ఇది ఫ్యాషన్‌ లాంటిది కాదు. సుస్థిరతను గురించిన గాంధేయ ఆలోచనలను ఈ సంస్థ బలంగా విశ్వసిస్తుంది. “ఆకలిని కానీ, దుఃఖాన్ని కానీ కలిగించినట్లయితే అది మేలిమి వస్త్రమైనా సరే అందులో ఏ సౌందర్యమూ ఉండదు” అని మహాత్మా గాంధీ అన్న మాటలను దివ్యాంశు అసోపా ఉదాహరిస్తారు.

  “సంతోషకరమైన సంగతి ఏమిటంటే భారతీయ యువత ప్రస్తుతం ఎంతో అవగాహన కలిగి ఉంటోంది.  ఏం ఉపయోగిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నాం, అసలు ఈ ఉత్పత్తులు ఎలా తయారవుతాయి, వాటికి ఎంత నీరు అవసరమౌతుంది, వాటిల్లో రసాయనాల వాడకం ఉందా, ఎవరు వాటిని తయారు చేస్తారు… వంటి విషయాల గురించి యువతరం ఇప్పుడు తరచి చూసి తెలుసుకుంటోంది. అందుకే యువతరం కోసం వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేసి అందించడంపై మేము దృష్టి కేంద్రీకరిస్తున్నాము” అని దివ్యాంశు అసోపా చెప్పారు. 

  ‘హోలీ కా డబ్బా’లో ఏం ఉంటుందంటే…

  ఇదిలావుండగా భారతీయ పండుగలపై దృష్టి సారించిన ఈ సంస్థ వినూత్నమైన పలు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చింది. రాఖీ పండుగ కోసం, విత్తన రాఖీలను తయారు చేసింది. ఈ రాఖీలను ఉపయోగించాక వాటిని నాటితే మొక్కలు పెరుగుతాయి. అలాగే దీపావళి కోసం, ఈ సంస్థ ‘బీజ్ పటాకా’ కూడా తెచ్చింది. ఇది కాగితం వ్యర్థాల నుండి తయారై విత్తనాలతో పొందుపరచబడిన ప్యాక్. ఇక హోలీ కోసం, ‘ఫూల్‌చంద్’ ప్రారంభించింది. ‘హోలీ కా డబ్బా’ పేరుతో తయారైన ఈ ప్యాక్‌ పూర్తిగా హెర్బల్ ఉత్పత్తుల పేటిక. ఇందులో పర్యావరణానికి హాని కలిగించని సహజమైన రంగులు ఉంటాయి. పసుపు, మోదుగ, బీట్‌రూట్ వంటివాటితో వీటిని తయారు చేస్తారు. అలాగే గులాబీ రేకలు, విత్తనాల వంటివాటితో తయారైన మరో మిశ్రమం కూడా ఉంటుంది. వీటితో పాటు ఆరు విత్తన ఉండలను ఈ ప్యాక్‌లో భాగంగా అందిస్తారు. అపరాజిత, మందార, మేథీ, టొమాటో వంటి మొక్కల విత్తనాలు ఈ ఉండల్లో ఉంటాయి. అలాగే విత్తనాలతో కూడిన ప్లాంటబుల్ హోలీ గ్రీటింగ్ కార్డు కూడా ‘హోలీ కా డబ్బా’లో ఉంటుంది. ఇలా ఈ సంస్థ ఉత్పత్తులన్నీ పండుగల వేడుకలను మరింత అర్ధవంతమైన రీతిలో నిర్వచించేవే.

  “రాబోయే కొద్ది నెలల్లో, మా ఫెస్టివల్ ఆధారిత ఉత్పత్తులను విస్తృతంగా కస్టమర్లకు చేర్చేలా ప్లాన్ చేస్తున్నాము. ఇందుకోసం, మేము భారతదేశం అంతటా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాము. అయితే ఈ తరహా ఉత్పత్తులను మ్యాన్యువల్‌గా తయారు చేయడానికి కాస్త సమయం పడుతుంది” అని దివ్యాంశు అసోపా చెప్పారు.

  విత్తనాల క్యాలెండర్ తయారీ

  21 ఫూల్స్ లోగడ 12 రకాలైన విత్తనాలతో ఒక క్యాలెండర్‌ని తయారు చేసింది. ఇది ఎంతో ఆదరణ కూడా పొందింది. మందారం, తులసి, మిరప వంటి మొక్కలకు సంబంధించిన విత్తనాలతో ఈ క్యాలెండర్ (పేపర్‌)ను తయారు చేశారు. సంవత్సరం ముగిశాక క్యాలెండర్‌ను నాటితే ఈ విత్తనాలన్నీ మొలకెత్తుతాయన్నమాట. ఇలా దేశవ్యాప్తంగా లక్షలాది మొక్కలు మన పరిసరాల్లో పెరిగేందుకు 21 ఫూల్స్‌ సంస్థ ప్లాంటబుల్ పేపర్ దోహదపడింది.

  21 ఫూల్స్ సంస్థకు ఇలా ఇంకా చాలా ఆలోచనలే ఉన్నాయి. ఉదాహరణకు-టూత్ బ్రష్‌లు, పేస్ట్‌లు, దువ్వెనల వంటి అనేక ఉపకరణాలను ప్యాక్ చేసేందుకు కాగితాన్ని వాడతారు. అలాంటి ప్యాక్‌లను  చేతితో తయారు చేసిన కాగితం (handmade paper) నుండి తయారు చేయవచ్చు. విత్తన కాగితాన్ని అందుకు ఉపయోగించవచ్చు. అదే జరిగితే మనం ఇంటికి తెచ్చుకునే ప్రతి పేపర్ ప్యాక్‌తో వినియోగదారులకు విత్తనాలు కూడా అందుతాయి. అలా మొక్కల పెంపకం పెరుగుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది.

  ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

  21Fools Design and Entertainment Pvt Ltd

  59, Vishnupuri Colony, Durgapura,

  Jaipur 302018, Rajasthan

  contact@21fools.com, wedding@21fools.com

  +91- 97833-83304 (Sachin)

  + 91- 9167587469

  https://www.facebook.com/divyanshu.asopa