ఉపాధి హామి పథకంలో నర్సరీల ఏర్పాటుకు అనుమతి

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది.

రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు.  

ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు 
నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి.  50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె,  కమలాపురం మండలం నసంతపురం, వీఎన్‌ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 

రైతులకు వరం 
సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు.    

పొలం ఉన్నా.. లేకున్నా..  
సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్‌ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్‌ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. 

నర్సరీలతో మరింత ఉపాధి 
రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.               
– యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/permission-set-nurseries-under-mgnre-guarantee-scheme-1451247