ఉపాధి హామీలో మహిళా శక్తి

  • కూలీల గ్రూపు లీడర్లుగా మహిళలే 
  • మేట్‌లుగా వారికి మాత్రమే అవకాశం  
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

  ఉపాధి హామీ కూలీల గ్రూపు లీడర్లు (మేట్‌)గా మహిళలనే ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం మేట్‌గా కొనసాగే వారికి సంఘం తరఫున పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఆధారంగా రూ.3 చొప్పున అదనపు ఆదాయం పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ జాబ్‌ కార్డులున్న కూలీలు కలిసి 5,99,256 శ్రమ శక్తి సంఘాలుగా ఏర్పడగా 3.83 లక్షల సంఘాలకు మహిళలే మేట్‌లుగా ఉన్నారు. మహిళా మేట్‌లలో అత్యధికులు ఇటీవలే ఎంపిక కాగా మిగిలిన సంఘాల్లో కూడా మహిళల ఎంపికకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

  కూలీల పని సామర్థ్యం పెంచడంతోపాటు అత్యధిక వేతనం పొందేలా ఉపాధి పథకం ద్వారా వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల ప్రాతిపదికన  పనులు కల్పిస్తోంది. 15 – 25 మంది కూలీలు కలిసి శ్రమ శక్తి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం లో కూలీల సంఖ్యపై నిర్దిష్టంగా నిబంధనలు ఏవీ లేవు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఒక్కోశ్రమ శక్తి సంఘంలో కూలీలందరికీ కలిపి ఒకేచోట పనులు అప్పగిస్తున్నారు. ఈ సంఘాల్లో కొన్ని చోట్ల ఇప్పటివరకు పురుషులు మేట్‌గా వ్యవహరిస్తుండగా తాజాగా మేట్‌లుగా మహిళలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/women-are-group-leaders-employment-guarantee-scheme-workers-1378635