ఉపాధి హామీ కూలీలకు వేతన పెంపు

  • ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశం  
  • కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీవోలు పనులను పర్యవేక్షించాలి 
  • ముందస్తు రుతుపవనాలతో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి  
  • సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీల నిర్మాణాల్లో జాప్యాన్ని అనుమతించేది లేదు 
  • ఇళ్ల లే అవుట్లలో పెండింగ్‌ అప్రోచ్‌ రోడ్లు, లెవలింగ్‌ పనులను వెంటనే చేపట్టాలి 
  • ఈ వారంలోనే రూ.700 కోట్లు అందుబాటులోకి తెస్తున్నాం
  • ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి.. టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాల్లో పొరపాట్లకు తావివ్వొద్దు 

ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం కనీసం రూ.240 వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం సమగ్ర సర్వే ప్రక్రియకు సంబంధించి నిర్దేశించుకున్న గడువులను గుర్తు చేస్తూ వీటిని ప్రతి కలెక్టర్‌ నోట్‌ చేసుకోవాలని సీఎం సూచించారు.

స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ, పేదల గృహ నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లపై ముఖ్యమంత్రి జగన్‌ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

తనిఖీలతో పనుల్లో నాణ్యత
కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీవోలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నందున వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి. 

జాప్యాన్ని అనుమతించేది లేదు
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి. కలెక్టర్లు వీటిపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. వీటి నిర్మాణాల విషయంలో వెనకబడ్డ జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి పనితీరు మెరుగుపరుచుకోవాలి.

కోర్టు కేసులున్న స్థలాల్లో ప్రత్యామ్నాయాలు
కోర్టు కేసుల కారణంగా పంపిణీ కాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తారు. న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్న స్థలాలపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఒక్కో కేసు వారీగా పరిశీలించి ప్రణాళిక రూపొందిస్తారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా అందిన 2,11,176 దరఖాస్తులను అర్హత కలిగినవిగా గుర్తించారు.

ఇందులో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ చేశాం. మరో 98,914 మందికి వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేలా భూములను గుర్తించాలి. టిడ్కో ఇళ్ల పనులు నాణ్యంగా ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
 
గడువులోగా సమగ్ర సర్వే 
జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది. నిర్దేశించుకున్న గడువులోగా సర్వే పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్యాలను కలెక్టర్లు సరి చూసుకోవాలి. రోజువారీ సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి. నిరంతరం సమీక్షిస్తూ ముందుకు సాగితేనే సమగ్ర సర్వే లక్ష్యాలను చేరుకోగలం.

ఇళ్ల పనులకు ఈ వారమే నిధులు
పేదల ఇళ్లకు సంబంధించి కొన్ని లే అవుట్లకు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌ రోడ్లను, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులను వెంటనే పూర్తిచేయాలి. దీనికి కావాల్సిన నిధులను ఈ వారంలోనే అందుబాటులోకి తెస్తున్నాం. సుమారు రూ.700 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్‌ 28న విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం.

ఇక్కడ గృహ నిర్మాణాలు వేగం పుంజుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతినెలా కనీసం 75 వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్‌ చేసుకోవాలి. కరెంటు, తాగునీరు, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీ కాలనీల్లో కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-jagan-mandate-collectors-rural-employment-guarantee-workers-1460545