ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు తక్షణ సేవలు అందిస్తోంది. ప్రభుత్వ సేవలు నిర్ణీత సమయంలో అందించడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ వినూత్న యంత్రాంగం సత్ఫలితాలనిస్తోంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఒక గర్భిణీకి కేవలం 8 గంటల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయించి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రశంసలు అందుకుంది. అర్ధరాత్రి సమయంలో సచివాలయ సిబ్బంది ఆ మహిళకు కార్డు అందజేయడం విశేషం.
వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన పైల ధనలక్ష్మి ప్రసవం కోసం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆస్పత్రిలో ప్రసవం చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని డాక్టర్లు చెప్పారు. కానీ, ఆమెకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయరాంపురం గ్రామ సచివాలయాన్ని సంప్రదించారు. సకాలంలో స్పందించిన సచివాలయ సిబ్బంది ధనలక్ష్మి కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు దరఖాస్తు చేయించి, ఆమె పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అధికారులు కూడా తక్షణం స్పందించారు. డిజిటల్ అసిస్టెంట్ రామ్మోహన్ రికార్డు స్థాయిలో కేవలం 8 గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును మంజూరు చేయడమే కాకుండా ప్రింట్ తీసి రాత్రి 11 గంటల సమయంలో రాజాంలోని కేర్ ఆస్పత్రికి వెళ్లి స్వయంగా అందజేశారు. దీంతో డాక్టర్లు ఆమెకు ప్రసవం చేశారు. అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసి తమను ఆదుకున్న గ్రామ సచివాలయ అధికారులకు ధనలక్ష్మి, ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన గ్రామ వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ శరవేగంతో పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రోజోల గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ బరాటం నరసింగరావు క్యాన్సర్తో బాధపడుతున్న ఓ బాలికకు ఆరోగ్య శ్రీ వర్తింపజేయడం కోసం ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు వెళ్లి తల్లిదండ్రులతో ఈ-కేవైసీ చేయించారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే ఆరోగ్య శ్రీకార్డు మంజూరు చేయడంతో పాపకు వైద్యం అందింది. చిన్నారి ఆరోగ్యం కోసం ఇంతలా తపన చెందిన నరసింగరావును గ్రామస్థులు అభినందించారు.
ప్రస్తుతం గరిష్ఠంగా దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపు ఆరోగ్యశ్రీ కార్డు జారీ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి. పింఛను కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి పట్టాలు కావాలన్నా, తాగునీటి సరఫరా సమస్య ఉన్నా, వైద్యం కానీ, రెవిన్యూ కానీ, భూముల సర్వేకానీ, శిశు సంక్షేమం కానీ, డెయిరీ కానీ.. ఇలాంటివెన్నో అంశాలకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు. సంక్షేమపథకాలు ప్రకటించడం ఒక ఎత్తైతే వాటిని జనసామాన్యానికి అందించడం మరొకెత్తు. వివిధ వర్గాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను అర్హులైనవారికి అందించడంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తన వంతు క్రియాశీల పాత్రను పోషించడం అభినందనీయం.
(telugu.news18.com సౌజన్యంతో… జనవరి 24, 2021)