ఎనిమిదే చదివినా… ఎంత సాధించాడో!

నేతకార్మికుల కోసం ఆసుయంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం లాంటిదే… మదురై మురుగేశన్‌ది కూడా. కాకపోతే మల్లేశం నేతన్నల కోసం తన మెదడుకి పదును పెడితే మురుగేశన్‌ రైతన్నల కష్టాల్ని చూసి తన యంత్రాన్ని కనిపెట్టాడు. అరటి బోదె నుంచి నారని వేరుచేసే మరయంత్రంతో జాతీయస్థాయి గుర్తింపు సాధించాడు. ఎనిమిదో తరగతిదాకే చదువుకున్నవాడు తన యంత్రాల్ని ఇప్పుడు విదేశాలకీ ఎగుమతి చేస్తున్నాడు!

పొలాల్లో ఆరుగాలం చెమటోడిస్తేకానీ పూటకింత భోజనం దొరకని రైతుకూలీల కుటుంబంలో పుట్టాడు మురుగేశన్‌. తమిళనాడులోని మదురై దగ్గరున్న మేళక్కాల్‌ అనే గ్రామం ఆయనది. ఎనిమిదో తరగతితోనే చదువు మాని పొలం పనులకి వెళ్లడం మొదలుపెట్టాడు. పాతికేళ్లకి రెండెకరాల పొలానికి సొంê దారుడయ్యాడు. చుట్టుపక్కలున్న రైతులందరిలాగే తానూ అరటి సాగు మొదలుపెట్టాడు కానీ అందులో పెద్దగా లాభాలు రాలేదు. దాంతోపాటూ ఆ ప్రాంతాన్ని కరవూ చుట్టుముట్టింది. ప్రజలందరూ మూటాముల్లె సర్దుకుని ఉపాధి కోసం పట్నంబాట పట్టడం మొదలుపెట్టారు. మురుగేశన్‌ కూడా అలా వెళ్లేవాడేకానీ ఓ ఆలోచన అతణ్ణి ఆపింది. ‘ఓసారి సంతలో ప్లాస్టిక్‌ తీగల్తో అల్లుతున్న బుట్టల్ని చూశాను. వాటిని చూశాక అరటి నారతోనూ అలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు ఓ ఎండిన నారని తీసుకుని తొడమీదపెట్టి ఓ పోగుగా మార్చాను. ఆ పోగు, ప్లాస్టిక్‌ తీగకి సమానంగా దృఢంగా అనిపించింది. ఇంకేం… అలాంటి నారని పెద్దఎత్తున ఉపయోగించి గృహాలంకరణ వస్తువుల్ని తయారుచేయొచ్చనే ఆలోచన వచ్చింది!’ అనంటాడు మరుగేశన్‌. పనిలోకి దిగాకకానీ అరటిబోదెని నారగా తీయడం, పెద్దఎత్తున పోగులుగా పేనడం అంత సులువు కాదన్న విషయం అర్థమైంది. అప్పుడే ఓసారి మురుగేశన్‌ కొబ్బరి నారని తాళ్లుగా పేనే యంత్రాన్ని చూశాడు. సైకిల్‌ చక్రంలాంటి దానికి చిన్న కప్పీ(పుల్లీ)ని పెట్టి రూపొందించిన యంత్రం అది. ఆ యంత్రంతో అరటి నారనీ పోగులుగా పేన వచ్చనే ఆలోచనొచ్చింది మురుగేశన్‌కి. కానీ యంత్రంలో అరటి నార పెట్టగానే పుటుక్కున తెగిపోయేది. దాంతో, మురుగేశన్‌ వారంపాటు రకరకాలుగా ప్రయోగాలు చేసి దాన్ని అరటి నారకి తగ్గట్టుగా మార్చాడు. ఆ చిన్న మార్పే అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది!

గృహిణుల చేదోడు…
మొదట్లో తాను రూపొందించిన సైకిల్‌ చక్రంలాంటి యంత్రానికే మోటారు కూడా బిగించాడు మురుగేశన్‌. దాంతో ఒక్కరోజులోనే 2500 మీటర్ల పొడవైన పోగుని ఉత్పత్తి చేయగలిగాడు. అదీ సరిపోదనిపించి, ఒకేసారి ఐదారు పోగులు రూపొందించేలా మరిన్ని ప్రయోగాలు చేశాడు. అందులో విజయం సాధించి ఒకేరోజు పాతిక వేల మీటర్ల పోగుని రూపొందించడం ప్రారంభించాడు. ఆ పోగుల్తో చాపలూ, కిటికీ తెరలూ, యోగా మ్యాట్‌లూ, ఏడురకాల బుట్టలూ, వాటిపైన పెట్టే మూతలూ… ఇలా రకరకాల ఉత్పత్తులు తయారుచేయడాన్ని తన భార్యతో కలిసి నేర్చుకున్నాడు. ఆ కళని తన గ్రామంలోని గృహిణులకీ నేర్పించి వస్తువుల తయారీ బాధ్యతనీ వాళ్లకే అప్పగించాడు. అలా ఉత్పత్తయిన వాటిని ఐఐటీ-మద్రాసులోని గ్రామీణాభివృద్ధి కేంద్రం ద్వారా ఇంగ్లండు, ఫ్రాన్స్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాలకి ఎగుమతిచేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసమే ఎమ్మెస్‌ రోప్స్‌ ప్రొడక్షన్‌ సెంటర్‌’ అనే సంస్థని ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా ఒకప్పుడు రోజుకి వందరూపాయలొస్తే చాలనుకున్న మురుగేశన్‌ కుటుంబం ఇప్పుడు కోటిన్నర రూపాయలు వార్షికాదాయం సాధిస్తోంది. తన గ్రామంలోని ఐదొందల మందికి ఉపాధిని చూపిస్తోంది. వీళ్లలో ఎక్కువమంది స్త్రీలే!

ఆదాయానికి ఢోకాలేకున్నా తనలోని ఆవిష్కర్తకి విరామం ఇవ్వలేదు మురుగేశన్‌. తన యంత్రాలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే బోదె నుంచి నారని తీయడం, తీసినదాన్ని పోగులుగా పేనడం, ఆ పోగుల్ని ఓ పనగా చుట్టడం… ఈ మూడింటినీ ఒకేచోట చేయగల ఆధునిక యంత్రాన్నీ కనిపెట్టి పేటెంట్‌ కూడా తీసుకున్నాడు. ఈ యంత్రాలని దేశవ్యాప్తంగా ఉన్న అరటి రైతులకి విక్రయిస్తున్నాడు. అంతేకాదు, నాబార్డు సహకారంతో ఆఫ్రికా దేశాలకి ఎగుమతి చేస్తున్నాడు. మురుగేశన్‌ ఆవిష్కరణలకుగాను కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఉత్తమ గ్రామీణ శాస్త్రవేత్తగా, కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డులు అందుకున్నాడు. ‘ఒకప్పుడు వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని నానా అగచాట్లు పడిన మా గ్రామప్రజలు నా పరిశ్రమ ద్వారా రోజూ నాలుగు డబ్బులు కళ్ళ చూస్తున్నారు. పేదరికం నుంచి బయటపడి సుఖంగా బతుకుతున్నారు. పిల్లల్ని కోరిన చదువు చదివించగలుగుతున్నారు. అవార్డులకన్నా నాకు ఇదే ఎక్కువ సంతృప్తినిస్తోంది!’ అంటున్నాడు మురుగేశన్‌.

Source : https://www.eenadu.net/sundaymagazine/article/321000178