ఎరువులపై అవగాహాన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ

  • ఆర్‌బీకేల ద్వారా రైతులకు విస్తృత అవగాహన
  • ఏ పంటకు ఏ ఎరువు, మోతాదుపై చైతన్యవంతం  
  • ఎరువుల కొరత లేదని స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ 

సమతుల ఎరువుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఏ సమయానికి ఏ ఎరువు వాడాలి.. ఎంత మోతాదులో వాడాలి.. తదితర విషయాలపై వారిని చైతన్యవంతుల్నిచేస్తోంది. డీఏపీ ఎరువుతో పోలిస్తే కాంప్లెక్స్‌ ఎరువుల్లో పంటకు కావాల్సిన పోషకాల లభ్యత ఎక్కువగా ఉండటంతో పాటు.. చీడపీడల ఉధృతిని అరికట్టడంలో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పెరుగుదల దశలో భాస్వరం కంటే.. నత్రజని, పొటాష్‌ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. డీఏపీలో నత్రజని, భాస్వరం మాత్రమే లభ్యమవుతుండగా, కాంప్లెక్స్‌ ఎరువుల్లో నత్రజని, భాస్వరంతో పాటుగా పొటాష్, గంధకం వంటి ఇతర పోషకాలు అదనంగా లభిస్తున్నాయి. వీటితో పంట నాణ్యతతో పాటు దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయని వ్యవసాయాధికారులు ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు.  

దిగుబడుల్లో ఏ మాత్రం తేడా ఉండదు..
► సాధారణంగా రైతులు పంటకు మొట్ట మొదటిసారి డీఏపీ వేస్తే.. పంట ఎదుగుదల, దిగుబడుల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తారు. అయితే మొదటి సారి డీఏపీ వేసినా, పోషకాలను ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో అందించినా పంట ఎదుగుదల, దిగుబడుల్లో ఏ మాత్రం తేడా ఉండదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. 
► రైతులు కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా.. విత్తిన/నాటిన నెల తర్వాత వేస్తే ఉపయోగం ఉండదంటున్నారు. వేర్ల్ల పెరుగుదలకు భాస్వరం అవసరం కనుక దీనిని ఆఖరు దుక్కిలో, దమ్ములోనే వేయాలని, లేకుంటే విత్తిన/నాటినప్పటి నుంచి 10–15 రోజులకు వేయాలని సూచిస్తున్నారు.
► మొక్కల పెరుగుదలలో కీలకమైన నత్రజనిని.. పంటను బట్టి 2 నుంచి 4 సార్లు వేయాల్సి ఉంటుందని, మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచి గింజలు/కాయలు బరువు పెరగడానికి పొటాష్‌ తోడ్పడుతుందని చెబుతున్నారు. 
► సార్వాలో పండించే వరి, పత్తి, మిరప, దాళ్వాలో పండించే వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలకు సిఫార్సు చేసిన పోషకాలను వివిధ రకాల ఎరువుల ద్వారా మోతాదు మేరకు అందించాలని సూచిస్తున్నారు.  
► అక్టోబర్‌ నెలకు 1.77 లక్షల టన్నుల యూరియా, 44 వేల టన్నుల డీఏపీ, 28 వేల టన్నుల ఎంవోపీ, 19 వేల టన్నుల ఎస్‌వోపీ, 2.06 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమని, అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది.  

ఎరువుల నిల్వలపై దుష్ప్రచారం తగదు
రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్నట్టుగా దుష్ప్రచారం చేయడం తగదు. ప్రస్తుత అవసరాలకు సరిపడా 6.88 లక్షల టన్నుల నిల్వలున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం ద్వారా మొక్కలకు సమతుల పోషకాలు అందించొచ్చు. సిఫార్సు చేసిన మేరకు వాటిని వినియోగించాలని ఆర్‌బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/awareness-balanced-fertilizers-andhra-pradesh-1409662