ఎలక్ట్రానిక్‌ క్లస్టర్స్‌,డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐటీ పాలసీపై బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుపై ఆయన అధికారులతో చర్చించారు. మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని, హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అ«ధికారులను ఆదేశించారు. 

    ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖకు తీసుకురావాలని, అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ వర్శిటీ డెస్టినేషన్‌ పాయింట్‌గా మారాలని సీఎం జగన్‌ ఆదేశించారు. భవిష్యత్‌లో విశాఖ నగరం ఐటీకి ప్రధాన కేంద్రంగా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి, అనంతపురం పట్టణాలలో కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన భూములను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

    రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి,  ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్‌(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-review-meeting-it-policies-1373240