ఎస్సీల సమగ్రాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు అవార్డులు

దేశవ్యాప్తంగా షెడ్యూల్‌ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకుంది.  ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు మన రాష్ట్రానివే కావడం విశేషం. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. 

దేశంలోనే అత్యున్నత పనితీరు 
షెడ్యూల్డ్‌ కులాల ప్రజలు ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన.. సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో బడికి దూరంగా ఉండే పిల్లలను బడులలో చేర్పించడం, అక్కడి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందజేయడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడంతో పాటు ఆ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.

ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు గ్యాప్‌ ఫండింగ్‌ రూపంలో ప్రత్యేకించి రూ.20 లక్షల చొప్పున అదనంగా ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం నిధులిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే మన రాష్ట్రంలోఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు తీరు ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ విభాగం జిల్లాల వారీగా అవార్డులను ప్రకటించింది.  

సీఎస్‌కు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శి 
మొత్తం మూడు అవార్డులకు గాను రెండు అవార్డులు ఏపీకే దక్కినట్టు  కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వానికి, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల అధికారులకు ఆ లేఖలో అభినందనలు తెలియజేశారు.  

Source:  https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/two-awards-andhra-pradesh-holistic-development-scs-1394246