ఏపీకి 16 కేంద్ర అవార్డులు

  • 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా 2020–21కి అవార్డులు ప్రకటించిన కేంద్రం 
  • 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు 
  • ఉత్తమ జిల్లా పరిషత్‌ అవార్డును గెలుచుకున్న తూర్పుగోదావరి 
  • ఉత్తమ చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా యెక్కోలు
  • గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో మాబగం గ్రామ పంచాయతీకి అవార్డు
  • గ్రామసభ నిర్వహణలో ఉత్తమ గ్రామంగా కొత్త మూలపేట 
  • 24న ఆన్‌లైన్‌ విధానంలో ప్రధాని చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 16 దక్కించుకుని సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా కేంద్రం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు లేఖ రాశారు.

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజును ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఈ నెల 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/16-central-awards-andhra-pradesh-1448421