ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా

  • దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 94.4 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీతో భరోసా
  • గ్రామాల్లో 97.3 శాతం, పట్టణాల్లో 86.8 శాతం కుటుంబాలకు పథకం వర్తింపు
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి   

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా వర్తిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఏపీలో 94.4 శాతం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది.

 రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 97.3 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తుండగా పట్టణాల్లో  86.8 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఆరోగ్య బీమాతో అత్యధికంగా ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల కిందకు ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో సర్వేలో విశ్లేషించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ ఉంది.

తెలంగాణ  ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 92 శాతం కుటుంబాలకు వర్తిస్తున్నట్లు తేలింది. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచింది. గోవాలో ఆరోగ్య బీమా పథకం 80.4 శాతం కుటుంబాలకు వర్తిస్తోంది. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 57.7 శాతం మందికే వర్తిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మిగిలిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలు కాకుండా కేంద్ర పథకాలను వర్తింప చేస్తున్నప్పటికీ ఎక్కువ కుటుంబాలకు బీమా ప్రయోజనం దక్కడం లేదని సర్వే తెలిపింది.

ఇవీ కారణాలు….
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ బాధ్యతలు చేపట్టగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని గాడిలో పెట్టారు. తెల్లరేషన్‌ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు కోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచారు. వార్షిక ఆదాయ పరిమితిని పెంచడంతో నెలకు రూ.40 వేల ఆదాయం పొందే మధ్య తరగతి కుటుంబాలు కూడా పథకం పరిధిలోకి వచ్చాయి. 

వైఎస్సార్‌ నవశకం ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రత్యేకంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో ఏపీలో అత్యధిక కుటుంబాలు ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా ముఖ్యమంత్రి చేపట్టారు. గత ఏడాది జూన్‌ 9వ తేదీ నుంచి ఆగస్టు  27వ తేదీ వరకు 2.86 లక్షల మందికి కొత్తగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/national-family-health-survey-said-andhra-pradesh-govt-provides-health