ఏపీలో పెట్టుబడులకు బ్రిటన్‌ ఆసక్తి

    ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ)తో పాటు ఇతర పారిశ్రామిక ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో ఏపీలో పర్యటిస్తోన్న ఏపీ, తెలంగాణ బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ బృందం సోమవారం సమావేశమైంది. ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులపై బ్రిటన్‌ బృందం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 

    విజయవాడకు వచ్చిన ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కమిషన్‌ పనితీరు, మహిళా సాధికారిత కోసం తీసుకుంటున్న చర్యలను ఫ్లెమింగ్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో బ్రిటిష్‌ కమిషన్‌ పొలిటికల్‌ అడ్వైజర్‌ నళిని రఘురామన్, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.సూయిజ్‌ ఉన్నారు.అలాగే, గుంటూరు జిల్లా కాజ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగన్‌ హోటల్‌ను ఆండ్రూ ఫ్లెమింగ్‌ సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్‌కు వచ్చిన ఆయన ఆంధ్ర వంటకాలను ఇష్టంగా తిన్నారు. ఆంధ్ర భోజనం చాలా బాగుందని కితాబిచ్చారు. అనంతరం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. 

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/britain-interested-investments-andhra-pradesh-says-cii-1386248