ఏపీ అనుకూలం.. పెట్టుబడులు పెట్టండి

  • సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ . పక్కన ఏపీ మారిటైమ్‌ బోర్డు సిఈవో ఎన్‌పీ రామకృష్ణారెడ్డి
  • పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పిలుపు
  • ఏపీలో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేస్తున్నాం
  • రవాణా వ్యయం తగ్గించేలా ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు

  ఆంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన తీర ప్రాంతముందని.. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌–2021లో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పీయూష్‌ గోయల్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రహదారులు, రైళ్లు, పోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరుకు రవాణా వ్యయం తగ్గించేందుకు.. ఏపీలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తున్నామని వివరించారు.

  ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌ మాట్లాడుతూ.. పెట్టుబడులకు అవసరమైన సహజసిద్ధమైన వనరులన్నీ ఏపీలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రూజ్‌ టూరిజం ద్వారా ఈ రేవులను అనుసంధానం చేస్తామన్నారు. సదస్సులో విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామ్మోహనరావు, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/piyush-goyal-calls-industrialists-investments-1347507