ఏపీ పంటల నమోదుకు తెలంగాణ అభినందన

    ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘పంటల నమోదు’ విధానం ఆదర్శనీయమని తెలంగాణా వ్యవసాయశాఖ అధికారుల బృందం కితాబిచ్చింది. తెలంగాణా రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన జాయింట్‌ డైరెక్టర్‌ బాలు నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం ఏపీలో పర్యటించింది. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌తో పాటు ఇతర వ్యవసాయాధికారులతో వారు సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా పంటల నమోదు అమలు తీరును ఏపీ అధికారులు వివరించారు. ఈ–క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగానే  సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంటల రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఇలా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకూ పంటల బీమానే ప్రామాణికంగా తీసుకుంటున్నామని వివరించారు. సీజన్‌ ప్రారంభం నుంచి పంట కొనుగోళ్లు పూర్తయ్యే వరకు పంటల నమోదు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏపీ వ్యవసాయ శాఖ ఈ క్రాప్‌ డీడీ జెడ్‌.వెంకటేశ్వరరావు, బీఎల్‌ స్వామి తదితరులు పంటల నమోదు ఏ విధంగా చేస్తున్నారో.. ప్రయోగాత్మకంగా చూపించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఏడీఏ ఎంఏ మసూద్‌ఖాన్, ఐటీ సెల్‌ ఇన్‌చార్జి బి.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/telangana-officials-team-comments-andhra-pradesh-crop-registration-policy