- సవాళ్లను అధిగమించి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాం
- 38 మంది ప్రతిభావంతులకు డీజీపీ డిస్క్ అవార్డులు
సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్ అనేక విషయాల్లో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. ‘ఏపీఎస్పీ కమాండేషన్ డీజీపీ డిస్క్ అవార్డు’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అవార్డులను తొలిసారిగా 38 మందికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో ఏపీ పోలీస్ శాఖ సిబ్బంది, వనరుల కొరత వంటి అనేక సమస్యలను ఎదుర్కొందన్నారు. వీటన్నింటినీ అధిగమించిన ఏపీ పోలీస్ శాఖ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశంలో పోలీస్ శాఖలో చేపట్టిన అనేక సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాలకు అండగా పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
వెన్నెముకగా ఏపీఎస్పీ
స్వాతం్రత్యానికి పూర్వం నుంచీ ఉన్న బెటాలియన్స్ ఫోర్స్ అనేక పోలీస్ విభాగాలకు వెన్నెముకగా ఉండటం గర్వకారణమని సవాంగ్ కొనియాడారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్ వంటి కీలక విభాగాల్లో 80 శాతం మంది ఏపీఎస్పీ సిబ్బంది డెప్యూటేషన్‌పై పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వీరు సేవలు అందించిన ఘన చరిత్ర ఉందన్నారు. ఏపీఎస్పీ నుంచే ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్) ఏర్పాటైందని.. ఏపీఎస్పీ దేశానికే ప్రామాణికంగా పనిచేస్తోందన్నారు.