పొదుపులో ఏపీ మహిళలే ముందు

  • దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఏపీ ఎస్‌హెచ్‌జీ మహిళలే అత్యధికంగా పొదుపు 
  • మన పొదుపు సంఘాలకు విరివిగా బ్యాంకుల రుణాలు 
  • సున్నా వడ్డీతో సంఘాల్లో క్రమశిక్షణ 
  • బాబు హయాంలో పెరిగిన నిరర్ధక ఆస్తులు ఇప్పుడు తగ్గుముఖం
  • 2019–20 ఆర్థిక ఏడాది నాబార్డు నివేదిక

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది. చంద్రబాబు సర్కారు తీరు వల్ల స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం కావడం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ సంఘాలు తిరిగి గాడిలో పడటాన్ని నాబార్డు నివేదిక ప్రతిబింబిస్తోంది.క పేర్కొంది.

రుణాల్లోనూ టాప్‌ 
దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది. 2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల
స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల  సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది.

► ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది.
► 2018–19లో దేశ వ్యాప్తంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున బ్యాంకులు 2.16 లక్షల రుణం మంజూరు చేయగా 2019–20లో 2.47 లక్షల రుణం మంజూరు చేశాయి. ఈ లెక్కన 14.35 శాతం వృద్ధి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే సగటున ఒక్కో సంఘానికి 3.35 లక్షల రుణం మంజూరు అయింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 15 శాతం పెరుగుదల. ఏపీలో అయితే ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని నివేదిక స్పష్టం చేసింది.