ఐటీ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటు

  • తక్షణ అవసరాల కోసం ప్రైవేటు బిల్డర్లతో కలిసి ఒప్పందం
  • ఆఫీస్‌ స్పేస్‌ వివరాలు తెలిపే విధంగా ప్రత్యేక పోర్టల్‌
  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం  శాటిలైట్‌ ఆఫీసులు
  • మినీ గ్లోబల్‌ కాంపిటెన్సీ సెంటర్లకు అవకాశం ? 
  • త్వరలో బిల్డర్లతో సమావేశం కానున్న ‘అపిటా’
  • పటిష్ట ప్రణాళిక రచిస్తోన్న ఏపీ ప్రభుత్వం  

  రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక రచిస్తోంది. గత ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఐటీ పార్కు నిర్మించకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్న సంస్థలు స్పేస్‌ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా.. విశాఖ, తిరుపతిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి అనంతపురం, తిరుపతి, విశాఖలో ఒక్కోచోట 1,000 నుంచి 2,000 ఎకరాల్లో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను నిర్మించాలని సంకల్పించింది. కానీ, ఇవి అందుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉండడంతో తక్షణం ఐటీ స్పేస్‌ అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ (అపిటా) ఒక పటిష్ట ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్ల సహకారం తీసుకోనుంది. 

  ఐటీ స్పేస్‌ వివరాలతో ప్రత్యేక పోర్టల్‌
  రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైనవి ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉందన్న వివరాలతో ఒక ప్రత్యేక పోర్టల్‌ను ‘అపిటా’ అందుబాటులోకి తీసుకురానుంది. ఐటీ పార్కుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో పాటు నిర్మాణం పూర్తిచేసుకున్నవి, నిర్మాణం పూర్తికావస్తున్న భవనాల్లో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందన్న వివరాలను ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం స్థానిక బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్లతో కలిసి అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేస్తారు. తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం వద్ద ప్రైవేటు బిల్డర్లు నిర్మిస్తున్న బిల్డింగ్‌ల వివరాలను ఈ పోర్టల్‌లో ఉంచనున్నారు. అంతేకాక..  ఈ బిల్డింగ్‌ల చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, స్కూళ్లు, రెస్టారెంట్లు వంటి వాటి వివరాలను కూడా అందులో పేర్కొంటారు. మరో రెండు వారాల్లో బిల్డర్లతో సమావేశం కావడానికి ‘అపిటా’ అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. కాగా, ఐటీ కంపెనీలు, బిల్డర్లకు మధ్యలో అపిటా కేవలం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ‘సాక్షి’కి వివరించారు.

  శాటిలైట్‌ ఆఫీసులు
  కోవిడ్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానం అమలులోకి రావడంతో ఇంటి నుంచి పనిచేసే వారికి అవసరమైన సేవలను అందించడానికి ఐటీ కంపెనీలు చిన్నచిన్న పట్టణాల్లో 30 సీట్ల సామర్థ్యంతో శాటిలైట్‌ ఆఫీసులు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నాయి. నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో పనిచేసే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఇక్కడ నుంచే పనిచేసే విధంగా వారికి బ్యాకెండ్‌ సపోర్ట్‌ ఇవ్వడానికి ఈ శాటిలైట్‌ ఆఫీసులను ఏర్పాటుచేయనున్నాయి. జోహో కార్ప్, ఫ్రెష్‌ వర్క్స్, సాప్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా వంటి సంస్థలు ఈ శాటిలైట్‌ కార్యాలయాలు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా బిల్డర్లతో ‘అపిటా’ చర్చలు జరుపుతోంది. అలాగే, టెస్కో, వాల్‌మార్ట్, టార్గెట్‌ వంటి రిటైల్‌ సంస్థలతో పాటు పలు బ్యాంకింగ్‌ సంస్థలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు గ్లోబల్‌ కాంపిటెన్సీ సెంటర్స్‌గా మారాయి. కానీ, అక్కడ భూమి ధరలు, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ భారీగా పెరిగిపోతుండటంతో తిరుపతి, అనంతపురం వంటి పట్టణాల్లో మినీ గ్లోబల్‌ కాపింటెన్సీ సెంటర్లను ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ అవకాశాలనూ అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

  Source: https://www.sakshi.com/telugu-news/business/ap-government-planning-create-workspace-it-firms-tier-2-cities-1376093