ఒక్కసారి ఉసిరి పంట వేస్తే 40 ఏళ్ల దిగుబడి 

సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది.

పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్‌లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే   వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది.

ఆయుర్వేద ఔషధం 
ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్‌ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది.

200 ఎకరాల్లో సాగు 
విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు.

ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది.  ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్‌లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. 

లాభాలనిస్తోంది..
పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా.  ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్‌ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది.        – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. 

అవగాహన కల్పిస్తున్నాం 
నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్‌లో ఎక్కువగా డిమాడ్‌ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. 
– లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/amla-crop-high-yield-and-profits-farmers-1473017