కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం

రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం చెల్లించడానికి నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం నాడు స్థానిక వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సమావేశ మందిరంలో ఆయన పత్రికా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పై పోరాటంలో “ఫ్రంట్ లైన్ వారియర్స్” గా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ముందు వరసలో వుండి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎంతోమంది పాత్రికేయులు విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టులందరి తరపున ముఖ్యమంత్రి గారిని కోరగా, ఆయన తక్షణం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని ఆయన తెలిపారు.ఇందుకు గాను ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.అలాగే కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వారికి కూడా సత్వరం మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు.ఇంకా ప్రతి జిల్లాలోను కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో ప్రత్యేకంగా బెడ్ లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి జర్నలిస్టుల విజ్ఞప్తిని మన్నించి, వారి కష్టాన్ని గుర్తించి జర్నలిస్టులను ఆదుకోవడానికి అన్నిరకాలుగా ప్రభుత్వం ముందుంటుందని, సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తుందని తెలిపారని అన్నారు.కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కొన్నిరాష్ట్రాలలో మినహా చాలా రాష్ట్రాలలో పరిహారం చెల్లించలేదని, మన రాష్ట్రంలో జర్నలిస్టులు కోరగానే సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి.మణిరామ్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటరాజు గౌడ్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఇతరులు పాల్గొన్నారు.